కోహ్లిని ఊరిస్తున్న మరో రికార్డు!

Virat Kohli Inches Closer To Breaking Another Record - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఓ రికార్డు ఊరిస్తోంది. మరో 8 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు నమోదు చేయనున్నాడు. ఆ రికార్డు మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌-భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక టీ20ల్లో 55 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ కోహ్లి 48.58 సగటుతో 1992 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి మరో ఎనిమిది పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా 2000 పరుగులు నమోదు చేయడమే కాకుండా భారత్‌ నుంచి ఈ ఫీట్‌ అందుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపు పొందనున్నాడు. ఇక ఓవరాల్‌గా ఇప్పటికే ఈ ఘనతను ముగ్గురు బ్యాట్స్‌మన్‌ అందుకున్నారు.

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్టిల్‌ 2271 పరుగులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో 2,140 పరుగులతో కివీస్‌కే చెందిన మెక్‌కల్లమ్‌ ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ ఈ క్లబ్‌లో చేరాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్‌ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 66 ఇన్నింగ్స్‌లో మెక్‌కల్లమ్‌, 68 ఇన్నింగ్స్‌లో గప్టిల్‌, 59 ఇన్నింగ్స్‌ మాలిక్‌లు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ 8వ స్థానంలో ఉన్న కోహ్లి సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న భారత్‌ అదే ఉత్సాహంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top