ఇది క్లిష్టమైన విజయం

Virat Kohli Fined for Aggressive Appealing - Sakshi

బుమ్రా, షమీ అద్భుతం

విరాట్‌ కోహ్లి వ్యాఖ్య

సౌతాంప్టన్‌: శక్తి సామర్థ్యాలకు పూర్తి పరీక్షగా నిలిచే మ్యాచ్‌లు జట్టుకు అవసరమైనవేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఓటమి ముప్పు తప్పించుకుంటూ ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సాధించిన ఉత్కంఠభరిత గెలుపును ప్రస్తావిస్తూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. ‘మేం వేసుకున్న ప్రణాళికలేవీ సాగని, ప్రతిభనంతా ప్రదర్శిస్తూ పుంజుకోవాల్సిన ఇలాంటి మ్యాచ్‌లు మా దృష్టిలో అతి ముఖ్యమైనవి. జట్టులో ప్రతి ఒక్కరూ తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. బంతిని స్వింగ్‌ చేస్తూ షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పిచ్‌ స్వభావం కారణంగా షాట్లు ఆడటం కష్టమైంది’ అని మ్యాచ్‌ అనంతరం కోహ్లి చెప్పుకొచ్చాడు. తొలుతే వికెట్లు పడగొట్టినా, బుమ్రాను సమయానుకూలంగా వాడుకుని ప్రత్యర్థికి హెచ్చరిక సందేశం పంపాలని ముందే అనుకున్నట్లు కోహ్లి తెలిపాడు.

కెప్టెన్‌ నమ్మకమే నాకు ప్రేరణ: బుమ్రా
బౌలింగ్‌కు దిగిన ప్రతిసారీ కెప్టెన్‌ తన మీద ఉంచే నమ్మకమే తనకు ప్రేరణ అని టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. అది తనకు ఎనలేని ఆత్మవిశ్వాసం ఇస్తుందని పేర్కొన్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌ లో తన చివరి రెండు ఓవర్లలో బుమ్రా ఏకంగా 7 యార్కర్లు వేయడం విశేషం. దీనిపై మాట్లాడుతూ ‘నెమ్మదిస్తున్న పిచ్‌కు తగిన విధంగా వికెట్లకు నేరుగా బౌలింగ్‌ చేస్తూ, యార్కర్లు సంధించా. వికెట్లు తీయకున్నా పరుగులు నిరోధిస్తూ ప్రత్యర్థి సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగేలా చేసి అవకాశాలు సృష్టించుకోవడం మా గేమ్‌ ప్లాన్‌’ అని అతడు వివరించాడు.

ధోని సలహా ఇచ్చాడు: షమీ
49వ ఓవర్లో బుమ్రా తక్కువ పరుగులివ్వడం తన పని తేలిక చేసిందని పేసర్‌ షమీ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ దానిని ఓ సవాలుగా భావించానన్నాడు. చివరి ఓవర్లో, అందులోనూ ప్రపంచ కప్‌లో సాధించినందున హ్యాట్రిక్‌ను చాలా ప్రత్యేకమైనదిగా అతడు అభివర్ణించాడు. ‘ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్‌లు చాలా అరుదు. ఇది మంచి అవకాశం. యార్కర్‌ వేసేందుకే ప్రయత్నించు అని ధోని సలహా ఇచ్చాడు. దానిని మైండ్‌లో పెట్టుకునే బౌలింగ్‌ చేశా’ అని షమీ తెలిపాడు. వికెట్‌ ఇవ్వకుండా మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ నబీ చిరాకు పెట్టినా, ఆ ప్రభావం బౌలింగ్‌పై పడనీయలేదని, అతడిని ఔట్‌ చేస్తే తమ గెలుపు ఖాయమని తెలుసని అన్నాడు. ‘షార్ట్‌ బంతులు, బౌన్సర్లను ఎదుర్కొనడంలో అఫ్గాన్ల బలహీనతను గుర్తించి అందుకు తగ్గట్లు బౌలింగ్‌ చేశాం. ఫుల్‌ లెంగ్త్‌ బంతులు వేయకుండా జాగ్రత్తపడ్డాం’ అని షమీ అన్నాడు.

కోహ్లికి జరిమానా
సౌతాంప్టన్‌: అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అతిగా అప్పీల్‌ చేసినందుకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డి మెరిట్‌ పాయింట్‌ను ఎదుర్కొన్నాడు. 29వ ఓవర్‌ బుమ్రా బౌలింగ్‌లో రహ్మత్‌ షా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేయగా అంపైర్‌ అలీమ్‌ దార్‌ తిరస్కరించాడు. దీంతో కోహ్లి... అతడి వద్దకు వెళ్లి వాదనకు దిగాడు. దీనికి ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.1 నిబంధన ప్రకారం లెవల్‌ 1 ఉల్లంఘన కింద భారత కెప్టెన్‌పై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో రెండు డి మెరిట్‌ పాయింట్లున్నాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top