ఈ విజయం కేరళ బాధితులకు అంకితం: కోహ్లి

Virat Kohli Dedicating The Victory To Kerala Flood Victims - Sakshi

నాటింగ్‌ హామ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇస్తున్నట్లు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. ఈ గెలుపును వారికి అంకితం ఇస్తున్నాం. ప్రస్తుతం అక్కడ చాలా విషాదకరమైన పరిస్థితి నెలకొంది. ఇది భారత క్రికెట్ జట్టుగా వారి కోసం మేము చేయగల చిన్న పని. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విదేశాల్లో మేం ఆడిన టెస్టుల్లో ఒక్క లార్డ్స్‌ టెస్టుల్లోనే చెత్త ప్రదర్శన కనబర్చాం. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులను సవరించుకోని రాణించాం. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్‌లో ముఖ్యంగా స్లిప్‌ క్యాచ్‌లతో మ్యాచ్‌ మా వశం చేసుకున్నాం. ఈ మ్యాచ్‌లో అన్నీ మాకు కలిసొచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో రహానే బాధ్యాతాయుతంగా ఆడాడు. ఆ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం కష్టం. కానీ అతను సానుకూలంగా ఆటను ఆస్వాదిస్తూ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు.’ అని చెప్పుకొచ్చాడు.

నా ఇన్నింగ్స్‌.. అనుష్కకు అంకితం..
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి తన ఇన్నింగ్స్‌ను అనుష్కశర్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.‘నేను నా ఇన్నింగ్స్‌ను నా సతీమణి అనుష్కశర్మకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఆమె ప్రోత్సాహం వెల కట్టలేనిది. నేను ఎల్లప్పూడు ప్రశాంతంగా ఉండేలా ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. ఈ మ్యాచ్‌లో నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు రాణించడం ఆనందంగా ఉంది. మేం ఎప్పుడూ మా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారిస్తాం. ఇదే ఊపుతో సిరీస్‌ కైవసం చేసుకుంటాం’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

చదవండి: మూడో టెస్ట్‌: భారత్‌ ఘనవిజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top