రహానే ఔట్‌.. కోహ్లి సెంచరీ

Virat Kohli Completed His 25th Test Century In Perth Test - Sakshi

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్‌లో విఫలమైన ఈ పరుగుల యంత్రం రెండో టెస్ట్‌లో క్లిష్ట పరిస్థితుల్లో రాణించి జట్టుకు అండగా నిలిచాడు. 172/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది.

ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ అద్భుత బంతితో రహానేను బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగుతేజం హనుమ విహారితో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ఇక ఓవరాల్‌గా రెండో క్రికెటర్‌.

76 మ్యాచ్‌లు.. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించగా.. దిగ్గజ క్రికెటర్‌ బ్రాడ్‌మన్‌ 52 మ్యాచ్‌లు.. 68 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 130 ఇన్నింగ్స్‌ల్లో.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావాస్కర్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కోహ్లి రికార్డును అధిగమించడానికి ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌కే అవకాశం ఉంది. 117 ఇన్నింగ్స్‌ల్లోనే 23 సెంచరీలు పూర్తి చేసిన స్మిత్‌.. బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

సచిన్‌ రికార్డు సమం..
ఆసీస్‌ గడ్డపై ఆరు సెంచరీలు నమోదు చేసిన సచిన్‌ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఆసీస్‌ గడ్డపై 2012 అడిలైడ్‌లో తొలి సెంచరీ సాధించిన కోహ్లి..2014-15 సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top