
జాగ్రత్త... ముందున్నది భారత్
పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న ఆస్ట్రేలియా త్వరలో జరగనున్న భారత్ పర్యటనపై కలవరపడుతోంది.
సహచరులకు ఆసీస్ సారథి స్మిత్ హెచ్చరిక
సిడ్నీ: పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న ఆస్ట్రేలియా త్వరలో జరగనున్న భారత్ పర్యటనపై కలవరపడుతోంది. మన ముందున్నది క్లిష్టమైన సిరీస్ అని కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన సహచరులను హెచ్చరించాడు. భారత్ ఉపఖండపు పరిస్థితుల్ని సాధ్యమైనంత తొందరగా ఆకళింపు చేసుకోకపోతే కష్టాలు తప్పవని చెప్పాడు. ‘అక్కడ ఆడటం పూర్తిగా భిన్నమైనది. అక్కడి పిచ్‌లు మా ఆస్ట్రేలియాలో మాదిరిగా ఉండవు. మా వాళ్లు ముందు దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది’ అని అన్నాడు. కంగారూ జట్టు 2004 తర్వాత భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది.
కొత్తగా వచ్చిన కుర్రాళ్లు మాథ్యూ రెన్‌షా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ బాగా ఆడుతున్నారని... కానీ వారికి భారత పిచ్‌లపై ఏమాత్రం అనుభవం లేదన్నాడు. ఏదేమైనా తమకు భారత్‌లో కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని అన్నాడు. ‘భారత పర్యటన ఎపుడైనా సరే సవాలుతో కూడుకున్నది. అక్కడ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఇందులో కష్టపడటం మినహా ఇంకే మార్గం లేదు. తేలిగ్గా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని అన్నాడు.