విండీస్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాలో చిన్న మార్పు

Umesh Yadav Replace Shardul In Odi Series Against West Indies - Sakshi

సాక్షి, ముంబై: వెస్టిండీస్‌పై టెస్ట్‌ సిరీస్ గెలిచిన ఉత్సాహంతోనే టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్దమవుతోంది. ఈ నెల 21 నుంచి గువహటి వేదికగా తొలి మ్యాచ్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 14 మంది సభ్యుల జట్టును ప్రకటించిన భారత వన్డే జట్టులో మార్పు చోటుచేసుకుంది. ఉప్పల్ వేదికగా కరేబియన్‌ జట్టుతో జరిగిన రెండో టెస్టులో గాయపడిన శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో సీనియర్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు అవకాశం కల్పించారు. వన్డే సిరీస్‌ మొదలయ్యేసరికి గాయం నుంచి శార్దూల్‌ కోలుకుంటాడని సెలక్షన్‌ కమిటీ తొలుత భావించింది. అయితే అతడికి మరింత విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు వన్డే జట్టు నుంచి తప్పించారు.  

ఇక ఈ సిరీస్‌కు సీనియర్‌ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని అందరూ భావించారు. అయితే వన్డేల్లో విండీస్‌ జట్టు బలంగా ఉన్న నేపథ్యంలో.. ప్రయోగాల జోలికి వెళ్లకుండా చిన్న చిన్న మార్పులతో రెండు వన్డేలకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఎన్నో అంచనాల నడుమ వన్డే జట్టులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌పై అందరి దృష్టి నెలకొంది. అయితే  సీనియర్‌ క్రికెటర్‌,  టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి విశ్రాంతినిచ్చి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పంత్‌కు అవకాశం కల్పిస్తాడా లేక రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకుంటాడో వేచి చూడాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top