
టోక్యో: వచ్చే ఏడాది సమ్మర్ టోక్యో ఒలింపిక్స్‌లో జరిగే మారథాన్, నడక రేసు వేదికలను మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ జాన్ కొయేట్స్ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ జరిగే జూలై, ఆగస్టులో టోక్యోలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని, అలాంటి వేడి వాతావరణంలో మారథాన్, నడక రేసులను నిర్వహించి అథ్లెట్ల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని ఆయన పేర్కొన్నారు. అందుకే వాటిని టోక్యో నుంచి ఉత్తర జపాన్‌లోని సప్పోరొ సిటీకి మారుస్తున్నట్లు తెలిపారు.
వాటిల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు పతకాల ప్రధానం మాత్రం టోక్యోలోనే నిర్వహిస్తామన్నారు. ఇటీవల దోహాలో ముగిసిన ప్రపంచ అథ్లెట్ల చాంపియన్‌షిప్ మారథాన్‌లో పాల్గొన్న పలువురు అథ్లెట్లు ఎండ వేడిమి తట్టుకోలేక రేసు నుంచి మధ్యలోనే వైదొలిగారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనే ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టోక్యో ఒలింపిక్ అభిమానులను తమ నిర్ణయంతో బాధ పెడుతున్నా అథ్లెట్ల శ్రేయస్సే మాకు ముఖ్యం అని జాన్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం పట్ల టోక్యో గవర్నర్ యురికో కోయ్‌కె అసంతృప్తి వ్యక్తం చేసింది.