పంజాబ్‌కు చావోరేవో | today Kings XI Punjab faced Mumbai Indians | Sakshi
Sakshi News home page

పంజాబ్‌కు చావోరేవో

May 10 2017 10:31 PM | Updated on Sep 5 2017 10:51 AM

పంజాబ్‌కు చావోరేవో

పంజాబ్‌కు చావోరేవో

ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గురువారం ముంబై ఇండియన్స్‌జట్టుతో తలపడనుంది.

నేడు ముంబైతో తలపడనున్న కింగ్స్‌ 
ఓడితే నాకౌట్‌ రేసు నుంచి పంజాబ్‌ ఔట్‌ 
ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన ముంబై


ముంబై: ప్లే ఆఫ్‌ బెర్తే లక్ష్యంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గురువారం ముంబై ఇండియన్స్‌జట్టుతో తలపడనుంది. చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న పంజాబ్‌ అదేజోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమితో కంగుతున్న ముంబై తిరిగి విజయాల బాట పట్టాలని కృత నిశ్చయంతో ఉంది.

పంజాబ్‌కు డూ ఆర్‌ డై...
ప్లే ఆఫ్‌ బెర్త్‌ సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఉంది. నిజానికి తాము ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ రెండింటిలో అద్భుత విజయం సాధించింది. అది కూడా తీవ్ర ఒత్తిడిలో కావడం విశేషం. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ ఆరు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో 12 పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం పంజాబ్‌లో ఆత్మవిశ్వాసం పెంచింది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగ్గా రాణించిన పంజాబ్‌ కీలకమైన గెలుపును కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో రాహుల్‌ తెవాటియా లాంటి ప్రతిభావంతమైన స్పిన్నర్‌ జట్టుకు లభించాడు. ఒకే ఓవర్‌లో కోల్‌కతా కెప్టెన్‌ గౌతం గంభీర్‌తోపాటు ఫామ్‌లో ఉన్న రాబిన్‌ ఉతప్పను పెవిలియన్‌కు పంపి పంజాబ్‌ను  మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. మరోవైపు ఓ మాదిరి లక్ష్యాన్ని తమ బౌలర్లు కాపాడుకోవడం జట్టును అనందపరిచి ఉంటుంది. ఇక జట్టు బ్యాటింగ్‌ విషయానికొస్తే హషీమ్‌ ఆమ్లా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 420 పరుగులు చేశాడు. అయితే తను చాంపియన్స్‌ట్రోఫీ కోసం జట్టు నుంచి దూరమ య్యాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (263 పరుగులు) కోల్‌కతాపై కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మనన్‌ వోహ్రా (229 పరుగులు), షాన్‌ మార్‌‡్ష (229) ఆకట్టుకుంటున్నారు.  అక్షర్‌ పటేల్‌ (186), వృద్ధిమాన్‌ సాహా (128) సత్తా చాటాల్సి ఉంది. మార్టన్‌ గప్టిల్‌ తొలిమ్యాచ్‌లో ఆకట్టుకున్న మిగతా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. వీలైనంత త్వరగా తను గాడిలో పడాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సందీప్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌  చేస్తున్నాడు.

11 మ్యా చ్‌ల్లో 16 వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలి చాడు. అక్షర్‌ పటేల్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌ను చూపించాల్సి ఉంది. కోల్‌కతాపై మోహిత్‌ శర్మ అదరగొట్టాడు. కీలకమైన వికెట్లు తీయడంతో అతనికే ఆ మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇదే తీరులో తను రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన మ్యాట్‌ హెన్రీ ఫర్వాలేదనిపించాడు. ఇరుజట్ల మధ్య ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌ జరుగగా 8 వికెట్లతో ముంబై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్‌ లో నెగ్గి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు నాకౌట్‌ ఆశల ను సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్‌ జట్టు యోచిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోతే మిగతా మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ముంబై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్‌ జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని విజయమే లక్ష్యంగా పంజాబ్‌ బరిలోకి దిగుతోంది.

ముంబై దూకుడు...
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్లు అంచానాలకు మించి రాణించింది. ఈ సీజన్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మళ్లీ పుణే చేతిలోనే ముంబై ఓటమిపాలైంది. అనంతరం మరో మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి హ్యాట్రిక్‌ సాధించింది. దీంతో 18 పాయింట్లతో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే చివరిమ్యాచ్‌లో ముంబై జోరుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కళ్లెం వేసింది.  ఓవరాల్‌గా 12 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు, మూడు పరాజయాలు నమోదు చేసింది. మొత్తం మీద 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జట్టు బ్యాటింగ్‌ విషయానికొస్తే కుర్ర బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన నితీశ్‌ 321 పరుగలు చేసి జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

కీరన్‌ పోలార్డ్‌ (299 పరుగులు), పార్థివ్‌ పటేల్‌ (287), జోస్‌ బట్లర్‌ (272 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ రాణించాడు. సహచరులంతా విఫలమైన వేళ తను పోరాడడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. హార్దిక్, కృనాల్‌ పాండ్య సోదరులు తమ ఆల్‌రౌండ్‌ ప్రతిభను చాటుతున్నారు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే కివీస్‌ పేసర్‌ మిషెల్‌ మెక్లీనగన్‌ బంతితో రాణిస్తున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన మిషెల్‌.. జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా (14 వికెట్లు), కృనాల్‌ (10), లసిత్‌ మలింగ (9)లతో బౌలింగ్‌ పటిష్టంగా ఉంది.

హర్భజన్‌ (9) ఎక్కువగా వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రిస్తున్నాడు. మొత్తం మీద మిగతా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ సీజన్‌లో పంజాబ్‌ సాధించిన భారీ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement