రాణించిన తెలంగాణ జట్లు

Telangana Teams Enter Final of Level Two Basket Ball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ లెవల్‌–1 స్థాయిలో ఆశించిన మేరకు రాణించలేకపోయిన తెలంగాణ బాలబాలికల జట్లు లెవల్‌–2 కేటగిరీలో ఫైనల్‌కు చేరుకున్నాయి. కోయంబత్తూర్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్లు విజయం సాధించి ముందంజ వేశాయి. 15, 16 స్థానాల కోసం జరిగే ఈ ఫైనల్లో విజయం సాధించిన జట్టు... వచ్చే ఏడాది జరుగనున్న ఇదే టోర్నీలో లెవల్‌–2 కేటగిరీ గ్రూప్‌ ‘సి’లో సీడెడ్‌ జట్టుగా బరిలోకి దిగుతుంది. మొదట బాలుర విభాగంలో జరిగిన లూజర్స్‌ నాకౌట్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో తెలంగాణ 66–38తో హిమాచల్‌ప్రదేశ్‌ జట్టుపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున కార్తీక్‌ 12 పాయింట్లు, గౌతమ్‌ 10 పాయింట్లు, జాసిమ్‌ 8 పాయింట్లు సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌ జట్టులో శర్మ 18 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. నేగి 12 పాయింట్లతో శర్మకు చక్కని సహకారం అందించాడు. అనంతరం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 62–41తో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఖాజావలీ (24 పాయింట్లు), గౌతమ్‌ (12 పాయింట్లు) జాసిమ్‌ (11 పాయింట్లు) వేగంగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి తెలంగాణ 30–18 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని అందుకుంది.

అనంతరం ఉత్తరాఖండ్‌ వ్యూహాత్మకంగా ఆడుతూ కొన్ని పాయింట్లు సంపాదించినా జట్టు గెలిచేందుకు అవి సరిపోలేదు. దీంతో తెలంగాణ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్తరాఖండ్‌ తరఫున వినాయక్‌ (13), చనుహాన్‌ (13) మెరుగ్గా ఆడారు.

బాలికల విభాగంలోనూ తెలంగాణ ఆధిపత్యం కొనసాగింది. మొదట క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తెలంగాణ 61–56తో హిమాచల్‌ప్రదేశ్‌పై విజయం సాధించింది. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా పోరాడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి స్కోరు 25–25తో సమమైంది. రెండో సగభాగంలోనూ హోరాహోరీగా ఇరుజట్లు తలపడ్డాయి. కీలక సమయంలో రాణించిన తెలంగాణ జట్టు స్వల్ప ఆధిక్యంతో గెలుపును అందుకుంది. విజేత జట్టులో సిద్ధిక (18) తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా... హర్షిత (14), మోహన (8), స్వాతి (7) దూకుడు కనబరిచారు. ప్రత్యర్థి జట్టులో కుమారి (19), ఆశ్రిత (14), నేగి (13) పోరాడారు. సెమీఫైనల్లో తెలంగాణ 53–50తో బిహార్‌పై నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ప్లేయర్లు ఓజస్వి (14), నిత్య (13), హర్షిత (13) సత్తా చాటారు. బిహార్‌ తరఫున ముస్కాన్‌ (26) చెలరేగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top