తెలంగాణ జట్లకు రెండో విజయం | Telangana Basket ball Team Got Second Victory | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్లకు రెండో విజయం

May 18 2019 9:58 AM | Updated on May 18 2019 9:58 AM

Telangana Basket ball Team Got Second Victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు జోరు కనబరుస్తున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగుతోన్న ఈ అండర్‌–16 టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 74–53తో పశ్చిమబెంగాల్‌పై గెలుపొందింది. ఆట ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన తెలంగాణ జట్టు సమష్టిగా రాణించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 40–23తో పటిష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. చివరివరకు అదే ఆధిపత్యాన్ని కొనసాగించి గెలుపును అందుకుంది.

విజేత జట్టు తరఫున కార్తీక్‌ 15 పాయింట్లతో చెలరేగగా... గౌతమ్‌ (13 పాయింట్లు), సౌరవ్‌ (12 పాయింట్లు), ఆంథోని (11 పాయింట్లు), సూర్య (10 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించారు. పశ్చిమ బెంగాల్‌ తరఫున మొహమ్మద్‌ ఇబ్రహీం 27 పాయింట్లతో పట్టుదలగా ఆడాడు. మరోవైపు బాలికల పోరులో తెలంగాణ 56–42తో అస్సాం జట్టును ఓడించింది. హోరాహోరీగా మ్యాచ్‌ సాగడంతో తొలి క్వార్టర్స్‌ 15–14 స్కోరుతో ముగిసింది. రెండో క్వార్టర్‌లో దూకుడు పెంచిన తెలంగాణ 30–21తో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తదుపరి రెండు క్వార్టర్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి హర్షిత చెలరేగడంతో జట్టు విజయాన్ని అందుకుంది. హర్షిత 23 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. సిద్ధిక (6), ఓజస్వి (6), యశస్విని (6) రాణించారు. అస్సాం తరఫున షింజిని (12), ధరిత్రి (12), ఎస్‌.కర్మాకర్‌ (10) పోరాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement