
కొత్త చరిత్ర సృష్టించేందుకు అవకాశం లభించింది. కానీ చివరకు చరిత్ర మారలేదు. అదే పాత కథ పునరావృతమైంది. విదేశీ గడ్డపై భారత బౌలర్లు విజయావకాశాలు సృష్టిస్తే, వాటిని ఉపయోగించుకోలేక బ్యాట్స్‌మెన్ నేలపాలు చేసిన టెస్టుల జాబితాలో మరొకటి చేరింది. దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు విజయంతో అద్భుత ఆరంభాన్ని అందుకునే అవకాశాన్ని కోహ్లి సేన కోల్పోయింది. సొంత మైదానాల్లో వరుస విజయాల తర్వాత ఆశలతో, అంచనాలతో సఫారీ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియాకు విదేశాల్లో మ్యాచ్ గెలవాలంటే అంత సులువు కాదని మళ్లీ అర్థమైంది.
208 పరుగుల విజయలక్ష్యం. పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కాస్త కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. కానీ మన స్టార్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. పరిస్థితికి అనుగుణంగా ఆడలేక ఒకరిని అనుసరిస్తూ మరొకరు వేగంగా పెవిలియన్ చేరారు. మ్యాచ్‌కు ముందు భారత్ ఆటపై పెద్దగా అంచనాల్లేవంటూ వ్యంగ్య బాణాలు విసిరిన ఫిలాండర్ నిజంగానే పదునైన బంతులతో మన పని పట్టాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు పాఠాలు నేర్పేలా అశ్విన్, భువనేశ్వర్ కొంత పోరాడినా లాభం లేకపోయింది. ‘యోయో టెస్టు’ల్లో పాస్ అయిన మన ఆటగాళ్లు, అసలు ఆటలో మాత్రం ఫెయిలయ్యారు.
ఈ టెస్టు నుంచి భారత్ ఊరట చెందే అంశం ఏదైనా ఉందంటే అది మన పేస్ బౌలర్ల ప్రదర్శనే. తొలి రోజు శుభారంభంతో ఒక దశలో మ్యాచ్‌పై పట్టు చిక్కేలా చేసినా... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 130కే ప్రత్యర్థి ఆలౌట్ చేయగలిగినా అది వారి గొప్పతనమే. ఇదే జోరు కొనసాగితే తర్వాతి మ్యాచుల్లోనైనా మన జట్టు గెలుపును ఆశించవచ్చేమో!
కేప్‌టౌన్: సఫారీ పర్యటనను భారత్ పరాజయంతో ప్రారంభించింది. వర్షార్పణం అయిన రోజును మినహాయిస్తే... మూడు రోజుల్లోపే ముగిసిన తొలి టెస్టులో భారత్ 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. న్యూలాండ్స్ మైదానంలో సోమవారం 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (53 బంతుల్లో 37; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వెర్నాన్ ఫిలాండర్ (6/42) తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటైంది. డివిలియర్స్ (50 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. షమీ, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు శనివారం నుంచి సెంచూరియన్‌లో జరుగుతుంది.
షమీ, బుమ్రా జోరు...
65/2 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాను భారత పేస్ బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. అద్భుతమైన స్వింగ్, అనూహ్య బౌన్స్‌తో చెలరేగి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. రెండో ఓవర్లోనే ఆమ్లా (4)ను షమీ అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రబడ (5)ను కూడా షమీ వెనక్కి పంపాడు. ఈ దశలో ఒక ఎండ్‌లో డివిలియర్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా... భారత్ మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. బుమ్రా వేసిన అద్భుత బంతికి డు ప్లెసిస్ (0) వద్ద జవాబు లేకపోగా, అతని తర్వాతి ఓవర్లో డి కాక్ (8) కూడా చేతులెత్తేశాడు. ఫిలాండర్ (0)ను అవుట్ చేసి షమీ తన జోరు కొనసాగించగా, మహరాజ్ (15)ను అవుట్ చేసి భువనేశ్వర్ తానూ ఈ ఉత్సవంలో భాగమయ్యాడు. మోర్కెల్ (2)ను కూడా భువీ అవుట్ చేయగా... భారీ షాట్‌కు ప్రయత్నించి బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సోమవారం కేవలం 21.1 ఓవర్లు మాత్రమే ఆడిన దక్షిణాఫ్రికా 65 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోవడం విశేషం.
అంతా విఫలం...
ఊరించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయంపై ఆశలు పెట్టుకుంది. తగినన్ని ఓవర్లు కూడా అందుబాటులో ఉండటంతో దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఆడితే జట్టు గెలుపు దిశగా సాగేది. అయితే దక్షిణాఫ్రికా పేసర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. గాయంతో స్టెయిన్ మ్యాచ్‌కు దూరమైనా... ఫిలాండర్ జట్టు భారాన్ని మోయగా, రబడ, మోర్నీ మోర్కెల్ అండగా నిలిచారు. అయితే మరోసారి ధావన్ (16) పుల్ షాట్ ఆడటంలో విఫలమై అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే విజయ్ (13) కూడా బంతిని స్లిప్‌లోకి పంపించి వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి (40 బంతుల్లో 28; 4 ఫోర్లు), రోహిత్ (10) భాగస్వామ్యం ఆశలు చిగురింపజేసింది. అయితే మళ్లీ చెలరేగిన ఫిలాండర్ తన వరుస ఓవర్లలో వీరిద్దరిని పెవిలియన్ పంపించాడు. ఫిలాండర్ అద్భుత బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీనిపై రివ్యూ చేసినా లాభం లేకపోయింది. రోహిత్ బంతిని వికెట్లపైకి ఆడుకొని తన విఫల టెస్టును ముగించాడు. తొలి ఇన్నింగ్స్ హీరో హార్దిక్ పాండ్యా (1), సాహా (8) రబడ బారిన పడ్డారు.
ఆశలు రేపినా...
82/7తో భారత్ టీ విరామానికి వెళ్లింది. అనంతరం ఇక పరాజయం లాంఛనమే అనిపించిన దశలో అశ్వి న్, భువనేశ్వర్ (13 నాటౌట్) పోరాడారు. వీరిద్దరు పట్టుదలగా నిలబడటంతో పాటు చకచకా పరుగులు సాధించడంతో దక్షిణాఫ్రికా జట్టులో అసహనం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిద్దరు 13 ఓవర్ల పాటు సఫారీలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరకు కెప్టెన్ మళ్లీ ఫిలాండర్‌నే నమ్ముకున్నాడు. అతని బౌలింగ్‌లో కట్ చేయబోయి డి కాక్ అద్భుత క్యాచ్‌కు అశ్విన్ అవుట్ కావడంతో భారత్ ఓటమికి చేరువైంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. తర్వాతి మూడు బంతుల్లో ఫిలాండ ర్... షమీ (4), బుమ్రా (0)లను అవుట్ చేసి భారత్ కథ ముగించాడు.
►10 ఈ టెస్టులో భారత కీపర్ సాహా 10 మంది బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమై గతంలో ధోని (9) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను ఐదేసి క్యాచ్‌లు పట్టాడు.
► తొలి ఇన్నింగ్స్‌లో మాకు దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకొని వారిని 220కే పరిమితం చేస్తే ఫలితం మరోలా ఉండేది. వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బ తీసింది. మూడు రోజులు కూడా మేం సమఉజ్జీలుగానే ఉన్నాం. 208 లక్ష్యం అనేది ఎలా చూసినా కష్టమైంది కాదు. అయితే మాలో ఒకరు 20–30 పరుగులు కాకుండా కనీసం 70–80 చేయాల్సింది. ఒక బౌలర్ తగ్గినా వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం దృష్టి పెట్టాల్సి ఉంది. మేం కూడా వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాం కాబట్టి పూర్తి వైఫల్యంగా కూడా చెప్పలేం. నిజానికి మా బౌలర్లు సర్వశక్తులూ ఒడ్డారు. వారికి నా సానుభూతి. ఇలాంటి పిచ్ ఎదురై మళ్లీ అవకాశం వస్తే దానిని వదులుకోం. బౌలర్లు ప్రత్యర్థిని కుప్పకూలిస్తే బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడి ఫలితం రాబడతాం.
– కోహ్లి, భారత కెప్టెన్