
భారత పురుషుల జట్టు ,భారత మహిళల జట్టు
తొలి టి20లో ఘనవిజయం సాధించి భారత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మరోవైపు పర్యాటక జట్టు జోరును ఎలా నిలువరించాలో దక్షిణాఫ్రికా జట్టుకు అర్థం కావడంలేదు. సఫారీ టి20 జట్టులో అనుభవంలేని బౌలర్లు ఉండటంతో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగిపోయారు. గ్రౌండ్ షాట్‌లు ఆడటమే కాదు బంతిని గ్యాలరీల్లోకి కూడా పంపించగలనని కోహ్లి తన బ్యాటింగ్‌తో చూపించాడు.స్వతహాగా అత్యున్నత ఫీల్డింగ్ ప్రమాణాలు కలిగిన దక్షిణాఫ్రికా జట్టు క్యాచ్‌లు వదిలేయడం... తడబాటుతో ఫీల్డర్లు అదనపు పరుగులు ఇచ్చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆరంభం నుంచే ఓవర్‌కు పది అంతకంటే ఎక్కువ పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్టమే. ఇక భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా పకడ్బందీ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాకు ఇబ్బంది తప్పలేదు. అయితే హెన్‌డ్రిక్స్, బెహర్దీన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా చివరి వరకు దానిని కొనసాగించలేకపోయారు. రెండో టి20కు ఆతిథ్యమిస్తున్న సెంచూరియన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడే జరిగిన వన్డేలో యజువేంద్ర చహల్ తన మాయాజాలాన్ని ప్రదర్శించిన సంగతి మరచిపోవద్దు.
తొలి టి20లో గాయం కారణంగా కోహ్లి మధ్యలోనే మైదానం వీడినా రెండో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాను. భారత, దక్షిణాఫ్రికా మహిళల మ్యాచ్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అందించిన శుభారంభాన్ని తర్వాత వచ్చిన వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఏ క్రీడలోనైనా కొందరు తమ సత్తా ఏంటో తెలుసుకోవాలి. వేరే వాళ్లు చేశారని తాము అలా చేస్తామంటే ఫలితం ఉండదు. హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన భారీ షాట్‌లు అలవోకగా ఆడేస్తారు. మిగతా వారు వీరిద్దరిని అనుసరించడం... వారు కొట్టిన షాట్‌లు బౌండరీ దాటకుండా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లిపోవడం జరిగింది. ఫలితంగా భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. నేడు సెంచూరియన్ వేదికగా భారత పురుషుల, మహిళల జట్లు దక్షిణాఫ్రికాతో ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో మన రెండు జట్లూ విజయం సాధించి సిరీస్‌లను సొంతం చేసుకొని దక్షిణాఫ్రికాకు ఈ పరాజయం చిరకాలం గుర్తుండేలా చేయాలని ఆశిస్తున్నాను.