బ్రిటిష్‌ గడ్డపై తెలుగుబిడ్డ గర్జించిన వేళ...

Special Story About Pullela Gopichand Championship Of England - Sakshi

2001లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో అద్భుతం చేసిన పుల్లెల గోపీచంద్‌

అంచనాలు లేకుండా వెళ్లి ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ సొంతం

గతేడాది సింధు ప్రపంచ చాంపియన్‌. ఈ ఘనతకంటే మూడేళ్ల ముందు రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌. సింధు కంటే ముందే సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లోనూ రజత పతక విజేత. మరెన్నో సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ కూడా ఆమె గెలిచింది. కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సిక్కి రెడ్డి తదితర చాలామంది షట్లర్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇప్పుడు మెరికలు. వీరందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ఉంది కాబట్టి విజయాలు లభిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ పాతికేళ్ల క్రితం ఇలాంటి పేరెన్నికగల అకాడమీ ఏదీ మన దేశంలో లేదు. అయినప్పటికీ ఎన్నో ప్రతికూలతల నడుమ స్వయంకృషితో గోపీచంద్‌ 2001లో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ అయ్యాడు. అది కూడా క్రీడాకారుల కెరీర్‌ను దాదాపు సమాప్తం చేసే మోచిప్ప గాయం నుంచి కోలుకొని అతనీ విజయం సాధించడం గొప్ప విశేషం.

పుల్లెల గోపీచంద్‌ ఆడే రోజుల్లో బెంగళూరులో ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీ తప్ప వేరే చోట అకాడమీలు ఏవీ లేవు. ఉన్నంతలో భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) లేదంటే చిన్నా చితకా శిక్షణ కేంద్రాలతోనే నెట్టుకురావాలి. అక్కడా అరకొరే సౌకర్యాలే. ఇలాంటి అత్తెసరు శిక్షణతోనే నెట్టుకొని, తట్టుకొని, నెగ్గుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడు కచ్చితంగా మన తెలుగు తేజం    గోపీచందే! ఎంటెరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌) ఇది మోచిప్పకు అయ్యే అరుదైన గాయం. ఇది క్రీడాకారులకు శాపం. దీనికి గురైతే ఆటే కాదు... పూర్వపు నడక కూడా కష్టమే. ఇలాంటి గాయాలకు ఇప్పుడైతే స్పోర్ట్స్‌ మెడిసిన్, అత్యాధునిక ట్రీట్‌మెంట్‌ వచ్చింది కాబట్టి రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తేలిగ్గా బయట పడింది. మళ్లీ రాకెట్‌ పట్టింది. అయితే ఆ గాయానికి అప్పట్లో కెరీర్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. కానీ గోపీచంద్‌ పట్టుదల ముందు ఏసీఎల్‌ ఓడింది. అతని అంకితభావానికి ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ చేరింది.

‘సిడ్నీ’ చెదిరినా...
వరుసగా ఐదేళ్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన గోపీచంద్‌ సిడ్నీ ఒలింపిక్స్‌–2000 ఆరు నెలలపాటు తీవ్రంగా శ్రమించాడు. కానీ సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లు సిమెంట్‌ కోర్టులపై నిర్వహించడం గోపీచంద్‌కు మైనస్‌ పాయింట్‌ అయ్యింది. అప్పటికే మోకాలికి శస్త్ర చికిత్సలు జరిగి ఉండటంతో గోపీచంద్‌ గాయం తిరగబెట్టింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన గోపీచంద్‌ రెండో రౌండ్‌లో సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌ తర్వాత గోపీచంద్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. మోకాలిలో వాపు కూడా వచ్చింది. రెండో సీడ్‌ హెంద్రావాన్‌ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జ్వరంతోనే ఆడిన గోపీచంద్‌ వరుస గేముల్లో ఓడిపోవడంతో అతని ఒలింపిక్‌ కల చెదిరిపోయింది.

ఒక్కో అడ్డంకి దాటుకుంటూ...
ఏదైతే తాము కోరుకుంటామో దాని కోసం కష్టపడితే ఆలస్యమైనా మనకు కచ్చితంగా లభిస్తుందని అంటారు. సిడ్నీ ఒలింపిక్స్‌ వైఫల్యాన్ని తన మదిలో నుంచి తీసేసిన గోపీచంద్‌ ఏడాది తిరిగేసరికి ఎలాంటి అంచనాలు లేకుండా ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీకి వెళ్లాడు. 2001కు ముందు గోపీచంద్‌ 1997, 1998లలో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఆడినా రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. 1999, 2000లలో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగలేకపోయిన గోపీచంద్‌ ఈసారి ఎవరూ ఊహించని అద్భుతం చేశాడు. సిడ్నీ ఒలింపిక్స్‌ మాదిరిగానే ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీని కూడా సిమెంట్‌ కోర్టులపైనే నిర్వహించారు. ఈసారి మాత్రం గోపీచంద్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మోకాలిని సంరక్షించుకుంటూనే ఒక్కో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మ్యాచ్‌లు కాగానే వెంటనే ఐస్‌బాత్‌కు వెళ్లేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూనే ప్రాక్టీస్‌ చేసేవాడు. చివరకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండానే విజయతిలకం దిద్దుకున్నాడు.

తొలి రౌండ్‌లో గోపీ 15–11, 15–12తో రొనాల్డ్‌ సుసీలో (సింగపూర్‌)ను ఓడించాడు. రెండో రౌండ్‌లో 15–7, 15–4తో కొలిన్‌ హాటన్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచాడు. మూడోరౌండ్‌లో గోపీ ప్రత్యర్థిగా సిడ్నీ ఒలింపిక్స్‌ చాంపియన్‌ జీ జిన్‌పెంగ్‌ (చైనా) నిలిచాడు. కానీ గోపీచంద్‌ దూకుడుకు జిన్‌పెంగ్‌ చేతులెత్తేశాడు. గోపీ 15–3, 15–9తో జిన్‌పెంగ్‌ను ఓడించాడు. క్వార్టర్‌ ఫైనల్లో 15–11, 15–7తో ఆండెర్స్‌ బోసెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచిన గోపీచంద్‌... సెమీఫైనల్లో డెన్మార్క్‌ స్టార్‌ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్‌ పీటర్‌ గేడ్‌పై హోరాçహోరీ పోరులో 17–14, 17–15తో గెలిచాడు. ౖచైనా ప్లేయర్‌ చెన్‌ హాంగ్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. మార్చి 11న బర్మింగ్‌హమ్‌లోని జాతీయ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గోపీచంద్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 15–12, 15–6తో చెన్‌ హాంగ్‌ ను ఓడించి ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌గా అవతరించాడు. 1980లో ప్రకాశ్‌ పదుకొనే తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా చరిత్రలో స్థానం సంపాదించాడు.

గాయాలు వెంటాడినా...
కోర్టులో గోపీ రాకెట్‌కు జోరెక్కువ. అతని శరీరానికి దూకుడెక్కువ. ఈ దూకుడైన శైలి అప్పుడప్పుడూ సమస్యలు తెచ్చేది. అయినా సరే గోపీ తన శైలితోనే గాయాలకు ఎదురెళ్లాడు తప్ప ఆటతీరు ఎనాడూ మార్చుకోలేదు. చాలా మంది గోపీచంద్‌ను ఆడేతీరును మార్చుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు కూడా! 1994లో పుణే జాతీయ క్రీడల్లో గోపీచంద్‌ ఊహించనిరీతిలో గాయపడ్డాడు. టీమ్‌ విభాగంలో పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు సమన్వయ లోపంతో గోపీచంద్‌ను అతని భాగస్వామి ఢీకొట్టాడు. దాంతో కిందపడ్డ గోపీచంద్‌ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యులను సంప్ర దించగా ఆ గాయాన్ని ఎంటెరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌)గా తేల్చారు. మోకాలికి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు.

ఢిల్లీలోని డాక్టర్‌ అశోక్‌ రాజ్‌గోపాలన్‌... గోపీచంద్‌ మోకాలికి ఆపరేషన్‌ చేశారు. మళ్లీ గాయమైతే శస్త్ర చికిత్స చేసేందుకు నేనున్నానంటూ గోపీచంద్‌కు భరోసా ఇచ్చారు. నీదైన ఆట, నీకున్న సహజశైలినే నమ్ముకొని ఆడాలని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత గోపీచంద్‌ వరుసగా ఐదేళ్లపాటు 1996 నుంచి 2000 వరకు జాతీయ సింగిల్స్‌ చాంపియన్‌ అయ్యాడు. ఆ మధ్యలో మరో రెండుసార్లు అతని మోకాలికి చిన్నపాటి ఆపరేషన్‌లు జరిగాయి. తన మాటలతో గోపీచంద్‌లో ధైర్యం నింపిన డాక్టర్‌ అశోక్‌ రాజగోపాలన్‌ మాత్రం ఫీజు రూపంలో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ ఇవ్వాలని గోపీని కోరారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top