సలామ్‌ రహీమ్‌ సాబ్‌...

Special Story About Football Coach Syed Abdul Rahim - Sakshi

భారత ఫుట్‌బాల్‌ అత్యుత్తమ కోచ్‌గా గుర్తింపు

ఆయన ఘనతలకు దక్కని గౌరవం

1964లో భారత ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఉన్న ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్‌లో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. తిరిగొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు. ‘ఏముంది అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి. 1956లో రహీమ్‌ సర్‌ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. ఆయన నిజంగా ఫుట్‌బాల్‌ ప్రవక్త’... ఈ మాటలు చాలు కోచ్‌గా సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ చూపించిన ప్రభావం ఏమిటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టెక్నిక్‌లతో భారత ఫుట్‌బాల్‌ను పరుగెత్తించిన మన హైదరాబాదీ రహీమ్‌ సర్‌కు ఫుట్‌బాల్‌ ప్రపంచంలో స్థానం ప్రత్యేకం.

భారత్‌ ఫుట్‌బాల్‌ను ఇప్పుడు చూస్తున్న వారికి పాతతరంలో మన జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, పలు చిరస్మరణీయ విజయాలు సాధించిందని చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ 1950, 1960లలో మన ఫుట్‌బాల్‌ టీమ్‌ ఉచ్చ దశలో నిలిచింది. నాడు ఆటగాళ్లతోపాటు వారిలో ఒకడిగా ఈ విజయాలలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి సయ్యద్‌ అబ్దుల్‌ (ఎస్‌ఏ) రహీమ్‌. హైదరాబాద్‌కు చెందిన రహీమ్‌ శిక్షకుడిగా వేసిన ముద్ర ఏమిటో నాటితరం ఆటగాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే రహీమ్‌ సాబ్‌ కోచ్‌గా పని చేసిన కాలాన్ని భారత ఫుట్‌బాల్‌ స్వర్ణ యుగం అనడం అతిశయోక్తి కాదు.

సుదీర్ఘ కాలం పాటు... 
1909 ఆగస్టు 17న హైదరాబాద్‌లో జన్మించిన రహీమ్‌ కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశారు. ఫుట్‌బాల్‌పై ప్రేమతో టీచర్‌ ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్‌  సిటీ పోలీస్‌ జట్టుకు కోచ్‌గా వచ్చారు. రహీమ్‌ శిక్షణలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్‌ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీమ్‌ ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్ల పాటు భారత టీమ్‌ కోచ్‌గా తన స్థాయిని ప్రదర్శించారు. ఆయన శిక్షకుడిగా ఉన్న సమయంలోనే భారత్‌ 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్‌బోర్న్, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీమ్‌ కోచ్‌గా వ్యవహరించారు. మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో సుమారు లక్ష మంది ప్రేక్షకుల సమక్షం లో జరిగిన ఫైనల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్‌బాల్‌ అభిమానీ మరచిపోలేడు. ఇదే కోచ్‌గా రహీమ్‌ సాబ్‌ కెరీర్‌లో మరపురాని క్షణం.

కొత్త తరహా శైలితో... 
కోచ్‌గా రహీమ్‌ గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్‌ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4–2–4 వ్యూహాన్ని రహీమ్‌ చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్‌ 1958, 1962 ప్రపంచకప్‌లలో ఆడి టైటిల్‌ గెలవడం విశేషం. ఫార్వర్డ్‌లు లేకుండా ఆరుగురు మిడ్‌ఫీల్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహం. మోటివేషన్‌ స్పీకర్‌ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరులా కనిపించే రహీమ్‌ సాబ్‌ స్ఫూర్తిగానే తర్వాతి తరంలో ఎంతో మంది కోచ్‌లు తయారయ్యారు. వీరిలో అమల్‌ దత్తా, పీకే బెనర్జీ, నయూముద్దీన్‌ తదితరులు ఉన్నారు.

పురస్కారాల మాటే లేదు... 
1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్‌ 11న, 1963లో హైదరాబాద్‌లో రహీమ్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో... ‘రహీమ్‌ సాబ్‌ తనతో పాటు భారత ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’ అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలను చూపిస్తోంది. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకూ దిగజారుతూ వచ్చిన భారత ఫుట్‌బాల్‌ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. గొప్పవాళ్ల ఘనతలను గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించుకోవడంలో మన అధికారులు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటారు. కోచ్‌గా అజరామర కీర్తిప్రతిష్టలు దక్కినా రహీమ్‌ సాబ్‌కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.

తన జీవితకాలంతో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. ఆటగాళ్ల వ్యక్తిగత కష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ‘ద్రోణాచార్య’ అవార్డులు సొంతం చేసుకునే కోచ్‌లున్న ఈ కాలంలో అసలైన గురువుకు అలాంటి అవార్డు ఏమీ లభించలేదు. ఏదో అభిమానం ఉన్నవారు అప్పుడప్పుడు తలచుకోవడం మినహా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో రహీమ్‌ను గుర్తు చేసుకునే కార్యక్రమాలు, టోర్నీలు కూడా నిర్వహించలేదు. రహీమ్‌ కుమారుడు సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడే. హకీమ్‌ 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ తర్వాత భారత ఫుట్‌బాల్‌ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం గమనార్హం.

అజయ్‌ దేవ్‌గన్‌ నటనతో...

ఇన్నేళ్ల తర్వాత కోచ్‌ రహీమ్‌ జీవితం సినిమా కథకు పనికొస్తుందని బాలీవుడ్‌ గుర్తించింది. రహీమ్‌ పాత్రలో స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ నటిస్తూ ‘మైదాన్‌’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ‘ద గోల్డెన్‌ ఎరా ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్, 1952–1962’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న సినిమా రహీమ్‌ కోచ్‌గా భారత్‌ సాధించిన విజయాలను ప్రేక్షకుల ముందు ఉంచనుంది. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కథను చెప్పేందుకు మన దేశంలో సినిమా మాధ్యమానికి మించినది ఏముంది. ఈ సినిమా తర్వాతైనా రహీమ్‌ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని ఆశించవచ్చేమో.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top