థ్యాంక్స్‌ కోహ్లి: సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly Special Thanks To Kohli For Play Day Night Test  - Sakshi

ముంబై : డే-నైట్‌ టెస్టు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. టెస్టుల్లో నంబర్‌ వన్‌ జట్టైన టీమిండియా ఇప్పటివరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌ ఆడలేదు. భారత్‌-బంగ్లాదేశ్‌ మినహా అన్ని టెస్టు జట్లు డే నైట్‌ టెస్టులు ఆడాయి. పలు కారణాలు చూపుతూ డేనైట్‌ టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డే నైట్‌ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు. అంతేకాకుండా తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా వడివడిగా అడుగులు వేశాడు. మొదట కోహ్లిని ఒప్పించిన దాదా అనంతరం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డేనైట్‌ టెస్టు కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనలకు బీసీబీ అంగీకారం తెలపడంతో టీమిండియా తొలి డే-నైట్‌ టెస్టుకు మార్గం సుగుమమైంది. దీంతో కోలకతా వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి డే-నైట్‌ టెస్టుకు అంకురార్పణ జరగనుంది. 

టీమిండియా తొలి డే నైట్‌ టెస్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘బీసీబీ పింక్‌బాల్‌ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు అంగీకారం తెలిపిన కెప్టెన్‌ కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు‌’ అని గంగూలీ అన్నాడు. అయితే సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాల్సిందేనని దాదా పేర్కొన్నాడు.  నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లో పింక్‌బాల్‌ క్రికెట్‌ ఆడించాలని అప్పటి క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. ఇక అధ్యక్షుడిగా కేవలం 9 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో భారత క్రికెట్‌ అభివృద్ధికి దాదా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top