రిషభ్‌ పంత్‌ టైమొచ్చింది

Sourav Ganguly reckons Rishabh Pant will play for India - Sakshi

త్వరలోనే అతను జాతీయ జట్టులోకి వస్తాడు

మాజీ సారథి గంగూలీ వ్యాఖ్య

కోల్‌కతా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను చెండాడి అద్భుత శతకం బాదిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు సమయం ఆసన్నమైందని... అతను త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ లీగ్‌లోనే పటిష్ట బౌలింగ్‌ లైనప్‌ ఉన్న సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ పంత్‌ 63 బంతుల్లో అజేయంగా 128 పరుగులు చేశాడు. ‘పంత్‌ భవిష్యత్తు ఆశాకిరణం. అతను త్వరలోనే జాతీయ జట్టుకు ఆడతాడు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇదే ఆటతీరుతో పాటు నిలకడ ప్రదర్శిస్తే పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి యువ కెరటాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో దూరంలో లేరని పేర్కొన్నాడు. ‘పంత్, ఇషాన్‌ కిషన్‌లకు సమయం వచ్చింది. వాళ్లింకా యువకులే. తొందరపాటు అవసరం లేదు. ఇదే విధంగా ఆడుతూ ఇంకా పరిణతి సాధించాలి. రాబోయే కాలంలో వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

కానీ నిలకడ ముఖ్యం. దేశం కోసం ఓ క్రీడాకారుడిని ఎంపిక చేసే ముందు అతను నిలకడగా ఆడుతున్నాడో లేదో చూడటం ముఖ్యం. టి20 భిన్నమైన ఆటే కాదనను కానీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తేనే అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ధోని ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి తరం కాదు. దినేశ్‌ కార్తీక్‌ కూడా ఆ స్థానానికి పోటీదారే. శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ట్రోఫీలో అతని విలువెంటో చాటుకున్నాడు. అందుకే అతనే ఆ స్థానానికి సరిపోతాడని భావిస్తున్నా’ అని తెలిపాడు. పంత్‌ సూపర్‌ షో తనకు ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసిందని దాదా అన్నాడు. ‘ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో మెకల్లమ్‌ చేసిన విధ్వంసాన్ని అతని పక్కనే ఉండి చూశాను. ఇన్నాళ్లకు మళ్లీ అలాంటి ఇన్నింగ్స్‌ ఇది’ అని గంగూలీ అన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top