బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ!

Sourav Ganguly Likely to Be New BCCI President - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా వ్యవహరిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్‌ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. చివరకు ఆదివారం సాయంత్రం ఈ ఒప్పందం ఖరారైంది. ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి తేదీ.

అయితే తాజా సహకారం నేపథ్యంలో పోటీ లేకుండా వీరందరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఢిల్లీలో శనివారం అమిత్‌ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ బోర్డు అధ్యక్షుడు ఖాయమని వినిపించింది. అయితే 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరగా... గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దాంతో శ్రీనివాసన్‌ వర్గానికి చెందిన బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచి్చంది. అయితే చివరకు ఎక్కువ సంఘాలు బ్రిజేష్‌ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌... బోర్డు అధ్యక్షుడిగా 2020 సెపె్టంబర్‌ వరకు మాత్రమే కొనసాగగలడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అతను ‘విరామం’ తీసుకోక తప్పదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top