'వారి ఆటతీరు చిన్నపిల్లల కంటే దారుణం'

Shoaib Akhtar Comments After India Beat Newzeland In T20 Series - Sakshi

కరాచీ : టీమిండియాతో స్వదేశంలో జరిగిన ఐదు టీ 20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 5-0 తేడాతో ఓడిపోవడం సిగ్గుచేటని పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. ' న్యూజిలాండ్‌ ఆటతీరు గమనిస్తే చిన్న పిల్లల ఆటకంటే దారుణంగా ఉంది. కనీసం పరుగులు తీయడానికే కివీస్‌ బ్యాట్సమెన్‌ అపసోపాలు పడ్డారు. అయినా ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోవడం అంటే ఆ జట్టు ఆట ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కివీస్‌ జట్టులో అత్యంత అనుభవం ఉన్న బ్యాట్సమెన్‌గా పేరున్న రాస్‌ టేలర్‌ తన అనుభవాన్ని ఉపయోగించి ఒక్క మ్యాచ్‌లోనూ కివీస్‌కు విజాయన్ని అందించలేకపోయాడు. జట్టులోని ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విఫలమయ్యారు. కొలిన్‌ మన్రో, టిమ్‌ సీఫెర్ట్‌లు తమ ఇన్నింగ్స్‌లతో మెరిసినా వారికి మద్దతిచ్చే ఆటగాళ్లు కరువయ్యారు. నిజంగా నాకు న్యూజిలాండ్‌ జట్టును చూసి చాలా కోపం వచ్చింది. అసలు వాళ్లు ఏ రకమైన క్రికెట్‌ ఆడారో నాకు అర్థం కాలేదు. కివీస్‌ జట్టు తమ అర్థరహిత ఆటతీరుతో నా మనుసును గాయపరిచింది' అంటూ అక్తర్‌ యూట్యూబ్‌లో పేర్కొన్నాడు.40 బంతుల్లో 50 పరగులు చేయాల్సి ఉన్నప్పుడు ఏ జట్టైనా కొంత మెచ్యూరిటీతో ఆడుతుందని, కానీ కివీస్‌ జట్టు ఒక చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. అసలు ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ సరిగ్గా ఆడి ఉంటే 3-2 ఫలితం వచ్చేదని, రెండు మ్యాచ్‌లు సూపర్‌ఓవర్‌కు దారి తీసినా వాటిని కాపాడుకోవడంలో కివీస్‌ విఫలమయ్యిందంటూ' అక్తర్‌ పేర్కొన్నాడు.(అతడు టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌: అక్తర్‌)

మరోవైపు భారత ప్రదర్శన అత్యంత అద్భుతంగా ఉందని, ముఖ్యంగా భారత​ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా తర్వాతి మ్యాచ్‌ల్లో తన కమ్‌బ్యాక్‌ ఏంటో చూపెట్టాడని అక్తర్‌ పేర్కొన్నాడు. టీమిండియా జట్టు ప్రసుత్తం అద్భుతంగా ఆడుతుందని, ఏ వేదికైనా విజయం తమదే అనే ధీమాతో ప్రతీ మ్యాచ్‌లో భారత్‌ చెలరేగిపోతుందని అక్తర్‌ ప్రశంసించాడు. ​కాగా ఇప్పటికే ఐదు టీ 20ల సిరీస్‌ను 5-0 తేడాతో సాంతం చేసుకొని వన్డే పోరుకు సిద్ధమవుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ బుధవారం ఉదయం 7.30 గంటలకు హామిల్టన్‌ వేదికగా జరగనుంది. 
(బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top