షెల్లీ గెలిచింది మళ్లీ...

Shelley Ann wins 4th gold medal in World Athletics Championship - Sakshi

మహిళల 100 మీటర్ల విభాగంలో నాలుగోసారి స్వర్ణం నెగ్గిన జమైకా మేటి అథ్లెట్‌

స్వర్ణ పతకాల్లో బోల్ట్‌ రికార్డును బద్దలు కొట్టిన అలీసన్‌ ఫెలిక్స్‌

తల్లి హోదా వచ్చాక తమలో ప్రావీణ్యం మరింత పెరిగిందేకానీ తరగలేదని జమైకా మేటి అథ్లెట్‌ షెల్లీ యాన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌... అమెరికా స్టార్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ నిరూపించారు. మహిళల 100 మీటర్ల విభాగంలో తనకు తిరుగులేదని షెల్లీ మరోసారి లోకానికి చాటి చెప్పగా... ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్‌ ఫెలిక్స్‌ గుర్తింపు పొందింది. 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ పేరిట ఉన్న రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్‌ బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో 33 ఏళ్ల ఫెలిక్స్‌కు 17వ పతకం కావడం విశేషం.  

దోహా (ఖతర్‌): తక్కువ ఎత్తు ఉన్నా... ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లే అలవాటుతో... ‘పాకెట్‌ రాకెట్‌’గా ముద్దు పేరు సంపాదించిన జమైకా మేటి మహిళా అథ్లెట్‌ షెల్లీ యాన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌ మళ్లీ విశ్వవేదికపై కాంతులీనింది. తొలి సంతానం కోసం 2017 ప్రపంచ చాంపియన్‌ షిప్‌కు దూరమైన షెల్లీ... మగశిశువుకు జన్మనిచ్చాక ఈ ఏడాది మళ్లీ ట్రాక్‌పై అడుగు పెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రాణిస్తుందో లేదో అనే అనుమానం ఉన్న వారందరి అంచనాలను తారుమారు చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 5 అడుగుల ఎత్తు ఉన్న షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

రాకెట్‌ వేగంతో రేసును ఆరంభించిన షెల్లీ 20 మీటర్లకే తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి అందరికంటే ముందుకు వెళ్లిపోయింది. అదే జోరులో రేసును ముగించేసింది. డీనా యాషెర్‌ స్మిత్‌ (బ్రిటన్‌–10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్‌–10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచింది. రేసు ముగిసిన వెంటనే షెల్లీ తన రెండేళ్ల కుమారుడు జియోన్‌తో సంబరాలు చేసుకుంది. ‘మళ్లీ స్వర్ణం గెలిచి... నా కుమారుడితో విశ్వవేదికపై సగర్వంగా నిల్చోవడం చూస్తుంటే నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. గత రాత్రంతా నాకు నిద్ర లేదు. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలోనూ ఇలాగే జరిగింది. శుభారంభం లభిస్తే చాలు రేసులో దూసుకుపోతానని తెలుసు. అదే వ్యూహంతో ఈసారీ బరిలోకి దిగాను. కొన్నాళ్లుగా తీవ్రంగా కష్టపడ్డాను. భర్త జేసన్, కుమారుడు జియోన్‌ నాలో కొత్త శక్తిని కలిగించారు’ అని షెల్లీ వ్యాఖ్యానించింది. 

ఫెలిక్స్‌...12వ స్వర్ణం 
గత నవంబర్‌లో ఆడ శిశువు కామ్రిన్‌కు జన్మనిచ్చాక... ఈ ఏడాది జులైలో ట్రాక్‌పైకి అడుగు పెట్టిన అలీసన్‌ ఫెలిక్స్‌ 4x400 మిక్స్‌డ్‌ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్‌ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్‌ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది.  

జావెలిన్‌ ఫైనల్లో అన్ను రాణి... 
సోమవారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు 12 మంది పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌ ‘ఎ’ గ్రూప్‌లో పోటీపడిన అన్ను రాణి ఈటెను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఈ క్రమంలో 62.34 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో తొమ్మిదో స్థానంతో అన్ను రాణి నేడు జరిగే ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 200 మీటర్ల హీట్స్‌లో అర్చన 23.65 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల 400 మీటర్ల హీట్స్‌లో భారత్‌కే చెందిన అంజలీ దేవి 52.33 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top