నాకు గన్‌మన్‌తో భద్రత కల్పించండి: షమీ

Shami asks for gunner after death threats from wife Hasin Jahan - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ తనకు భద్రత కోసం గన్‌మన్‌ను నియమించాలని అమ్రోహ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా తనకు భద్రత కల్పించాలని విన్నవించాడు. ప్రధానంగా తన భార్య హసిన్‌తో ప్రాణహాని ఉందని తెలిపాడు. ఈ మేరకు భార్య నుంచి ఇప్పటికే బెదిరింపులు వచ్చినట్లు మేజిస్ట్రేట్‌ కు తెలిపినట్లు సమాచారం. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్‌ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది నెలల క్రితం భార్య హాసిన్‌ జహాన్‌తో మొదలైన వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.

తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని షమిపై జహాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీసీసీఐపై కూడా నిందలు వేయడం మొదలుపెట్టారు. అసలు షమీపై బీసీసీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. అయితే నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టింది. షమీ నిర్దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై క్లీన్ చిట్ విడుదల చేసింది. ఇక ఆ తర్వాత తనకు.. సంతానానికి పోషణ నిమిత్తం ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు చేసింది. దానికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు ఆమె చేసిన అప్పీలులో నెలకు రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top