 
															క్షమించి.. నిషేధం ఎత్తేయండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా తాను వ్యవహరించిన తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నానని...
	‘ఐబా'కు సరితాదేవి లేఖ
	 
	 న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా తాను వ్యవహరించిన తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నానని,  క్షమించి తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని భారత బాక్సర్ సరితా దేవి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబా)కు లేఖ రాసింది. తనకు అన్యాయం జరిగిందని పతకం తీసుకునేందుకు సరిత నిరాకరించడంతో... ఐబా ఆమెపై నిషేధం విధించింది. దీంతో వచ్చేనెల 19 నుంచి జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సరిత పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
	
	ఈ నేపథ్యంలో ఐబా నోటీసులకు సమాధానంగా సరిత లేఖ రాసింది. ‘ఆసియా క్రీడల సమయంలో అలా జరగాల్సి ఉండకూడదు. జరిగిన సంఘటనలకు అప్పుడే క్షమాపణ చెప్పాను. 14 ఏళ్ల నా కెరీర్‌లో ఎప్పుడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని నన్ను క్షమించాలని కోరుతున్నాను. మరోసారి ఇలాంటిది జరగదని హామీ ఇస్తున్నాను’ అని సరిత పేర్కొంది. మరోవైపు సరితపై నిషేధం ఎత్తివేతకు ప్రయత్నించాలని భారత క్రీడా మంత్రిత్వశాఖ, ఐఓఏ... బాక్సింగ్ ఇండియాను కోరాయి.
	
	 ఐబాకు నన్ను నిషేధించే అధికారం లేదు: సుమరివాలా
	 తనని నిషేధించే అధికారం ఐబాకు లేదని ఆసియా క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డిమిషన్‌గా వ్యవహరించిన అడిల్లె సుమరివాలా మండిపడ్డారు. ‘నన్ను నిషేధించడానికి ఐబా ఎవరు? నేను భారత బృందం మొత్తానికి చీఫ్‌గా ఇంచియాన్‌కు వెళ్లాను. నా నాయకత్వంలో ఆడుతున్న క్రీడాకారిణికి మద్దతుగా నిలవడం నా ధర్మం.  నేను ఎటువంటి బాక్సింగ్ పోటీల్లోనూ పాల్గొనేది లేదు కాబట్టి ఐబా నిషేధం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని సుమరివాలా తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
