సూపర్ సానియా | Sania Mirza-Martina Hingis Win BNP Paribas Open Title | Sakshi
Sakshi News home page

సూపర్ సానియా

Mar 23 2015 12:34 AM | Updated on Sep 2 2017 11:14 PM

సూపర్ సానియా

సూపర్ సానియా

ఇద్దరు అనుభవజ్ఞులు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది.

హింగిస్‌తో కలిసి ఇండియన్ వెల్స్ టైటిల్ కైవసం
 
 కాలిఫోర్నియా (అమెరికా): ఇద్దరు అనుభవజ్ఞులు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతకట్టిన తొలి టోర్నమెంట్‌లోనే సానియా చాంపియన్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో సానియా-హింగిస్ జంట డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-3తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది.
     
విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 2,95,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 83 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ ఓపెన్‌ను సానియా గెల్చుకోవడం ఇది రెండోసారి. 2011లో ఎలీనా వెస్నినా (రష్యా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కిది 42వ డబుల్స్ టైటిల్.
     
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సెట్‌లో సానియా జోడీ 2-4తో వెనుకబడింది. అయితే అనూహ్యంగా తేరుకొని ఈ ఇండో-స్విస్ ద్వయం వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో సానియా జంట ప్రత్యర్థి జోడీలకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
     
తాజా విజయంతో సానియా డబుల్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకోనుంది. సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో సానియా మూడో స్థానానికి ఎగబాకనుంది.
 
కాగితంపై మా ఇద్దరి పేర్లు పక్కపక్కన చూస్తే మంచి జోడీ అనుకుంటారు. అయితే పేర్లతో ఏమీ కాదు. కోర్టులో అడుగుపెట్టిన తర్వాత విజయం కోసం ప్రయత్నించాలి. ఈ టైటిల్‌తో మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్నాం. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మేము నెగ్గిన విధానం మా ఆధిపత్యాన్ని సూచిస్తోంది. హింగిస్ ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను పాయింట్ అవకాశాలు సృష్టిస్తే ఆమె దానిని ముగిస్తున్న తీరు అద్భుతం.      -సానియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement