సైనా మరో చరిత్ర | Sakshi
Sakshi News home page

సైనా మరో చరిత్ర

Published Sat, Apr 30 2016 12:42 AM

సైనా మరో చరిత్ర

రెండోసారి ‘ఆసియా’ పతకం ఖాయం 
క్వార్టర్స్‌లో షిజియాన్ వాంగ్‌పై గెలుపు

 
వుహాన్ (చైనా): పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-16, 21-19తో ప్రపంచ ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించింది. సెమీస్‌కు చేరడంద్వారా సైనా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందనుంది. 2010 ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా సెమీస్‌లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గతంలో పురుషుల విభాగంలో దినేశ్ ఖన్నా (1965లో) స్వర్ణం, అనూప్ శ్రీధర్ (2007లో) కాంస్యం సాధించారు. సైనా మాత్రం రెండుసార్లు పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.


షిజియాన్ వాంగ్‌తో 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా పలుమార్లు వెనుకబడినా వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చైనాకే చెందిన మరో స్టార్ ప్లేయర్ యిహాన్ వాంగ్‌తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 4-10తో వెనుకబడి ఉంది.

Advertisement
Advertisement