
సచిన్ తొడ కొడితే...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో లీగ్‌లో భాగస్వామ్యమయ్యారు.
►నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిసి చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు
►12 జట్లతో ఈ సీజన్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో లీగ్‌లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటికే ఫుట్‌బాల్‌లో కేరళ బ్లాస్టర్, బ్యాడ్మింటన్‌లో బెంగళూరు బ్లాస్టర్‌లకు యజమాని అయిన సచిన్ తాజాగా ప్రొ కబడ్డీలో కూతపెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలుగు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిసి చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ సీజన్‌ను 12 జట్లకు పెంచడంతో తమిళ ఫ్రాంచైజీని సచిన్–నిమ్మగడ్డ ద్వయం చేజిక్కించుకోగా... మరో తెలుగు పారిశ్రామికవేత్త గ్రంథి మలికార్జున రావు ఆధ్వర్యంలోని జీఎంఆర్ గ్రూప్ లక్నో జట్టును దక్కించుకుంది. జీఎంఆర్ సంస్థ ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టును కలిగివున్న సంగతి తెలిసిందే.
ప్రొ కబడ్డీలో మిగతా రెండు కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్ (గుజరాత్)ను అదాని గ్రూప్, హరియాణాను జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కొనుగోలు చేశాయి. ఐపీఎల్ తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన ఈ లీగ్ ఇప్పుడు 12 జట్లతో 130 పైచిలుకు మ్యాచ్‌లతో ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ ఐదో సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రొ కబడ్డీలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు భాగం కావడం పట్ల స్టార్ ఇండియా చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రొ కబడ్డీ లీగ్ ఇంతగా విజయవంతం కావడానికి స్టార్ నెట్‌వర్కే కారణమని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్‌సింగ్ గెహ్లాట్ అన్నారు.