
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘న్యూఢిల్లీ మారథాన్’లో పుల్వామా అమర జవాన్ల కోసం కదంతొక్కాడు. ఈవెంట్ ప్రారంభానికి ముందు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సచిన్ 10 ‘పుష్–అప్స్’ ఎక్సర్‌సైజ్ చేశాడు. మారథాన్‌లో పరుగు పెట్టాడు. బ్యాటింగ్ గ్రేట్ కదంతొక్కడంతో రూ. 15 లక్షలు పోగయ్యాయి. ఈ మొత్తాన్ని ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
‘ఓ మంచి పనికోసం నిధులను సేకరిస్తున్నారు. ప్రజలంతా ఇందులో భాగం కావాలని, ఎక్కువ మొత్తం నిధులు పోగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్దలతో పాటు ఉత్సాహంగా పరిగెత్తడానికి వచ్చిన బాలబాలికల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే తరం మీదే. జాతిని నడిపించేది మీరే. ఇలాంటి ఆరోగ్యకర వాతావరణంతో భారత్‌ను క్రీడలు ఆడే దేశంగా మార్చాలి. వెల్ డన్... ఢిల్లీ. ఈ మారథాన్‌కు మీ ఉరిమే ఉత్సాహమే ఊపిరి’ అని సచిన్ అన్నాడు.