క్లోహీని అభినందించిన సచిన్‌

Sachin Praised Virat Kohli's Captaincy  - Sakshi

సౌతాంప్టన్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌  అభినందనలతో ముంచెత్తాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ కోహ్లి కెప్టెన్సీ బాగా చేశాడని ప్రశంసలతో ముంచెత్తాడు. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలతో డాట్‌బాల్స్‌ వేయించి ఫలితం రాబట్టాడని తెలిపాడు. ఫీల్డింగ్‌ కూడా బాగా పెట్టాడని ప్రశంసించాడు. అటు బ్యాట్‌తోనూ  కీలకమైన 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కోహ్లి బాడీ లాంగ్వేజ్‌, ఫుట్‌వర్క్‌ ఆకట్టుకుందన్నాడు. అలాగే ఇన్నింగ్స్‌ మిడిల్‌ ఓవర్లలో ధోని-కేదార్‌ జాదవ్‌లు నెమ్మదైన భాగస్వామ్యంతో విసుగెత్తించారని విమర్శించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌ చూస్తే తనకు 2003 ప్రపంచకప్‌లో హాలండ్‌తో జరిగిన మ్యాచ్‌ గుర్తుకు వచ్చిందని తెలిపాడు. అప్పుడు ఇలాగే  తక్కువ పరుగులే చేశామని, కానీ బౌలర్ల చొరవతోనే విజయం సాధించగలిగామని గుర్తుకు తెచ్చుకున్నాడు. నెమ్మదైన పిచ్‌పై  అఫ్గాన్‌ క్రికెటర్లు అటు మొదట బౌలింగ్‌లోనూ, తర్వాత బ్యాట్‌తోనూ అదరగొట్టి భారత్‌కు ముచ్చెమటలు పట్టించారని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

షమీకి ముందే చెప్పా..
టీమిండియా పేసర్‌, హ్యాట్రిక్‌ హీరో మహ్మద్‌ షమీకి త్వరలోనే మంచి టైం వస్తుందని ముందే చెప్పానని సచిన్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్‌తో ఔరా అనిపించిన విషయం తెలిసిందే. ఈ మెగాఈవెంట్‌లో ఈ ఘనతనందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచిన షమీ.. ఓవరాల్‌గా 10వ బౌలర్‌గా గుర్తింపుపొందాడు. షమీ అద్భుత ప్రదర్శనపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ స్పందిస్తూ.. ‘త్వరలోనే నీదైనా టైం వస్తుంది. తుది జట్టులో అవకాశం లభిస్తుందని షమీకి చెప్పాను. అంటే భువనేశ్వర్‌కు గాయం కావాలనేది నా ఉద్దేశం కాదు. సంసిద్ధంగా ఉండని మాత్రం షమీకి చెప్పాను. దురదృష్టవశాత్తు భువీ గాయంతో వైదొలగడం.. షమీకి అవకాశం రావడం అలా జరిగిపోయింది. షమీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు గంటకు 140 కిలోమీటర్ల వేగం తగ్గకుండా వేసాడు’ అని కొనియాడాడు. షమీ అద్భుత ప్రదర్శనను యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తొలి నాలుగు మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కని షమీకి.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా భువనేశ్వర్‌ గాయపడటంతో అప్గాన్‌ మ్యాచ్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top