బెంగళూరు బొనాంజా | Royal Challengers Bangalore won by 14 runs | Sakshi
Sakshi News home page

బెంగళూరు బొనాంజా

May 18 2018 1:51 AM | Updated on May 25 2018 2:34 PM

Royal Challengers Bangalore won by 14 runs - Sakshi

బెంగళూరు ఇన్నింగ్స్‌ సాధారణంగానే ప్రారంభమైంది...! ముగింపు మాత్రం అదిరిపోయింది...! హైదరాబాద్‌ ఛేదన ఘనంగా మొదలైంది...ఆఖరుకు అయ్యో అనేలా ఓడిపోయింది...!  రాయల్‌ చాలెంజర్స్‌లో కోహ్లి ఆడలేదు...! ఆ బాధ్యతను మొయిన్‌ అలీ, డివిలియర్స్‌ తీసుకున్నారు...! హైదరాబాద్‌కు శిఖర్‌ ధావన్‌ ధమాకా తోడవలేదు... కానీ విలియమ్సన్, మనీశ్‌ పాండే కొమ్ముకాశారు...! సాధారణంగా మొదలైన విరాట్‌ జట్టు స్కోరు పైపైకి వెళ్లింది... దానిని అందుకోడానికి విలియమ్సన్‌ బృందం పోరాడింది... ఈ ప్రయత్నంలో విఫలమైనా అభిమానులను ఆకట్టుకుంది...!ఏకంగా 422 పరుగులు నమోదైన మ్యాచ్‌లో చివరకు బెంగళూరుదే  పైచేయి అయింది.

బెంగళూరు: శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడినా హైదరాబాద్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌కు మరో కీలక విజయం దక్కింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్‌ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218  పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా మొదటి బంతికే విలియమ్సన్‌ అవుట్‌ కావడం దెబ్బతీసింది. చివరి ఓవర్‌లో ఐదు పరుగులే రావడంతో బెంగళూరు 14 పరుగులతో విజయం సాధించింది.  

ఏబీ ఫోర్లు... మొయిన్‌ సిక్స్‌లు... 
డివిలియర్స్‌ క్రీజులో ఉంటే సిక్స్‌లకు కొదవుండదు... అవతలి ఎండ్‌లోని వారు బౌండరీలతో అతడికి సహకరించినా చాలు. అయితే, ఈ మ్యాచ్‌లో ఈ లెక్క తిరగబడింది. ఏబీ ఫోర్లతో పరుగులందుకుంటే, మొయిన్‌ సిక్స్‌లతో ప్రతాపం చూపాడు.  ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (12) త్వరగా అవుటవడంతో ఐదు ఓవర్లకు 39/2తో నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ కోలుకోవడం కష్టమేననిపించింది. కానీ, డివిలియర్స్, మొయిన్‌ జోడీ జట్టును ఒడ్డున పడేసింది. ఇద్దరిలో అలీనే ఎక్కువ స్ట్రయిక్‌  రేట్‌తో పరుగులు చేశాడు. ఓవైపు సహజ శైలికి భిన్నంగా ఏబీ బౌండరీలు సాధిస్తుంటే, థంపి బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో మొయిన్‌ జోరందుకున్నాడు. 8 నుంచి 14వ ఓవర్‌ మధ్య విరుచుకుపడిన వీరు ఏకంగా 93 పరుగులు పిండుకోవడం విశేషం. దీంతో బెంగళూరు రన్‌ రేట్‌ 10 దాటింది. మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 107 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో డివిలియర్స్‌ (32 బంతుల్లో), అలీ (25 బంతుల్లో) అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. మరింత భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో రషీద్‌ బౌలింగ్‌లో ధావన్‌ అద్భుత క్యాచ్‌కు ఏబీ వెనుదిరిగాడు. మరో బంతి వ్యవధిలో అలీ కూడా అవుటయ్యాడు. మన్‌దీప్‌ (4) నిరాశపర్చినా... గ్రాండ్‌హోమ్, సర్ఫరాజ్‌ 13 బంతుల్లోనే 34 పరుగులు చేసి స్కోరును 200 దాటించారు.  

మెరుపులు సరిపోలేదు...
భారీ లక్ష్యం... గత వారం ఢిల్లీపై ఆడినట్లు ఆడితేనే హైదరాబాద్‌ దానిని అందుకోగలదు. కానీ, ఈసారి ఓపెనర్లలో ధావన్‌ (18) తడాఖా చూపలేకపోయాడు. ఊపులో ఉండగా హేల్స్‌ (24 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) డివిలియర్స్‌ అత్యద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. అయినా విలియమ్సన్‌ పోరాటం ఆపలేదు. తనకే సాధ్యమైన ప్లేస్‌మెంట్‌ షాట్లతో అలరించాడు. సౌతీ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లు, మొయిన్‌ బౌలింగ్‌లో సాధించిన రెండు ఫోర్లు, సిక్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 28 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. మనీశ్‌ సైతం శివాలెత్తడంతో ఓ దశలో 8 ఓవర్లలోనే 100 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 24 బంతు ల్లో 55కు మారింది. మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. కానీ, 17వ ఓవర్‌ వేసిన సౌతీ ఆరు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. అప్పటికీ 18, 19వ ఓవర్లలో 14, 15 పరుగులు రావడంతో గెలుపు లెక్క 6 బంతుల్లో 20కి మారింది. సిరాజ్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతిని స్కూప్‌ షాట్‌ ఆడి విలియమ్సన్‌ నిష్క్రమించగా, స్ట్రైకింగ్‌లోకి వచ్చిన మనీశ్‌ పాండే పని పూర్తి చేయలేకపోయాడు.   

వాహ్‌ ఏబీ వాహ్‌... 
మొయిన్‌ అలీ బౌలింగ్‌లో అలెక్స్‌ హేల్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద డివిలియర్స్‌ అందుకున్న తీరు మాత్రం నిజంగా అద్భుతం. గురుత్వాకర్షణ శక్తిని తప్పుగా నిరూపిస్తున్నట్లుగా నాలుగు అడుగులకు పైగా అమాంతం గాల్లోకి ఎగిరిన అతడు... సిక్స్‌ వెళ్లే బంతిని ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ క్యాచ్‌ల జాబితాలో దీనికి ఖాయంగా చోటు దక్కుతుంది. 

70 ఈ మ్యాచ్‌లో బాసిల్‌ థంపి ఇచ్చిన పరుగులు. ఐపీఎల్‌లో  ఇదే అతి చెత్త బౌలింగ్‌ ప్రదర్శన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement