సన్‌ ‘బెర్త్‌’ కోల్‌కతా చేతిలో 

Royal Challengers Bangalore beat Sunrisers Hyderabad - Sakshi

ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి

చెత్త ఫీల్డింగ్‌తో తగిన మూల్యం

విజయంతో ముగించిన బెంగళూరు

చెలరేగిన హెట్‌మైర్, గురుకీరత్‌  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన చేతిలో ఉన్న ఆఖరి విజయావకాశాన్ని వదులుకుంది. గెలిస్తే ఎంచక్కా ప్లే ఆఫ్‌  చేరే మ్యాచ్‌లో బాధ్యతారహితంగా ఆడి ఓడింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు.  బౌలింగ్‌లో ఒకరిద్దరు కష్టపడినా... 13వ  ఓవర్లో హెట్‌మైర్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌ వదిలేయడం హైదరాబాద్‌ ఓటమికి బాటలు వేసింది. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడితేనే హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్‌కతా గెలిస్తే మాత్రం హైదరాబాద్‌ ఇంటిముఖం పడుతుంది. కోల్‌కతా చివరి బెర్త్‌ దక్కించుకుంటుంది. 

బెంగళూరు: కోహ్లి సేనే మురిసింది. తమ సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ముంచేసింది. శనివారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (43 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తర్వాత పరుగుల వేట ప్రారంభించిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. హెట్‌మైర్‌ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్‌ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్‌) వీరోచిత పోరాటం చేశారు. నాలుగో వికెట్‌కు 144 పరు గులు జోడించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. హెట్‌మైర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. 

ఆరంభం వేగంగా.... 
బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన గప్టిల్, సాహా తొలి ఓవర్లో 2 పరుగులే చేశారు. కానీ రెండో ఓవర్‌లో 19 పరుగులొచ్చాయి. గప్టిల్‌ 4, 6 బాదగా, సాహా బౌండరీ కొట్టాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో గప్టిల్‌ మరో      సిక్స్‌ కొట్టగా, చహల్‌ బౌలింగ్‌కు దిగిన నాలుగో ఓవర్లో సాహా వరుసగా 3 బౌండరీలు బాదేశాడు. దీంతో సన్‌ స్కోరు 4       ఓవర్లలోనే 44 పరుగులకు చేరింది. ఈ జోరుకు సైనీ బ్రేక్‌ వేశాడు. సాహా (11 బంతుల్లో 20; 4 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ తన తొలి ఓవర్లో గప్టిల్‌ (23 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే(9)లను ఔట్‌ చేయడంతో హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. కెప్టెన్‌ విలియమ్సన్, విజయ్‌ శంకర్‌ జట్టును నడిపించేందుకు శ్రమించారు.  

వీర విలియమ్సన్‌... 
స్కోరు పెంచేందుకు 14వ ఓవర్‌ నుంచి జోరు పెంచారు. సుందర్‌ వేసిన 14వ ఓవర్లో విజయ్‌ శంకర్‌ వరుసగా 2 సిక్సర్లు బాదాడు. కానీ ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. 15వ ఓవర్లో విలియమ్సన్‌ రెండు సిక్సర్లు బాదడంతో ఈ రెండు ఓవర్లలో 29 పరుగులొచ్చాయి. అనంతరం చహల్‌... యూసుఫ్‌ పఠాన్‌ (3)ను ఔట్‌ చేయడం ద్వారా ఐపీఎల్‌ లో 100 వికెట్లను పూర్తి చేసుకున్న 14వ బౌలర్‌గా నిలిచాడు. 17వ ఓవర్‌ సైనీ వేయగా విలియమ్సన్, నబీ చెరో బౌండరీ బాదారు. కానీ ఆఖరి బంతికి నబీ (4) లాంగాన్‌లో గురుకీరత్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లో పరుగుల్ని కట్టడి చేసిన ఖేజ్రోలియా... రషీద్‌ ఖాన్‌ (1)ను పెవిలియన్‌ చేర్చాడు. ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్లోనూ సైనీ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో విలియమ్సన్‌ కసిదీరా కొట్టాడు. దీంతో ఉమేశ్‌ బౌలింగ్‌లో వరుసగా 6,4,6,4,2 (నోబాల్‌),1,4లతో 28 పరుగులు వచ్చాయి. 

కష్టాలతో మొదలైంది... 
బెంగళూరుకు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. తొలి ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో పార్థివ్‌ (0) డకౌటయ్యాడు. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌ బాదిన కోహ్లి (7 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జోరు రెండో ఓవర్లోనే ముగిసింది. అతన్ని ఖలీల్‌ అహ్మద్‌  ఔట్‌ చేశాడు. డివిలియర్స్‌ (1) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. బెంగళూరు 20 పరుగులకే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. అప్పటికి ఇంకా 156 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 7 వికెట్లున్నాయి. ఈ దశలో హెట్‌మైర్, గురుకీరత్‌ ప్రత్యర్థి బౌలర్ల పాలిట ఫైర్‌మెన్‌ అయ్యారు. వీళ్లిద్దరి షాట్లకు ప్రత్యర్థి బౌలర్లు నీరసించారు, ఫీల్డర్లు అలసిపోయారు. చేతికొచ్చిన క్యాచ్‌ల్ని జారవిడిచారు. ఇక 24 బంతుల్లో 30 పరుగులే కావాలి. ఈ దశలో హెట్‌మైర్, గురుకీరత్, సుందర్‌ (0) ఔటవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా... నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఉమేశ్‌ (4 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top