అది కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్‌: యువరాజ్‌

Releasing Chris Lynn Bad Call By KKR Yuvraj - Sakshi

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు.  దాంతో కోల్‌కోత్‌ నైట్‌ రైడర్స్‌ కూడా తమ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ను వదిలేసుకుంది.  క్రిస్‌ లిన్‌ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్‌ వదిలేసుకుందనేది కాదనలేని  వాస్తవం. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్‌ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్‌ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్‌ సాధించాడు. మరాఠా అరేబియన్స్‌ తరుఫున లిన్‌ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్‌ హేల్స్‌ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు. లిన్‌ తాజా ప్రదర్శనతో కేకేఆర్‌ చింతించడం ఖాయం.

అయితే కేకేఆర్‌ ఫ్యాన్స్‌కు లిన్‌ను వదిలేయడం అమితంగా బాధిస్తోంది. హార్డ్‌ హిట్టర్‌ అయిన లిన్‌ను రిలీజ్‌ చేయడంతో ఆ ఫ్రాంఛైజీ అభిమానుల్ని షాక్‌ గురి చేసింది. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ సైతం వ్యక్తం చేశాడు. లిన్‌ను వదిలేయడం కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్‌గా అభివర్ణించాడు. ఇది తనకు ఓ జోక్‌గా అనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని అసలు కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ తెలియజేశారో,లేదో అంటూ యువరాజ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒకవేళ షారుఖ్‌ కూడా అతని వదిలేయడానికి ఇష్టపడితే అప్పుడు రిలీజ్‌ చేసినా ఇబ్బంది ఉండదన్నాడు.

‘ నేను చూసిన ఐపీఎల్‌లో లిన్‌ ఒక ప్రత్యేక ఆటగాడు. కేకేఆర్‌కు ఎన్నో సందర్భాలు మంచి ఆరంభాలు ఇచ్చాడు. అసలు అతన్ని ఎందుకు అంటిపెట్టుకోలేదో నాకైతే కచ్చితంగా తెలియదు. నా వరకూ అయితే అది కేకేఆర్‌ తప్పుడు నిర్ణయం. దీనిపై షారుఖ్‌కు మెస్సేజ్‌ ఉందా. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లో లిన్‌ అసాధారణ ఆటగాడు’ అని యువీ పేర్కొన్నాడు. ఇక విదేశీ లీగ్‌లో ఆడటంపై యువీ సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే రెండు-మూడేళ్లలో మరిన్ని లీగ్‌లు రాబోతున్నాయని, వాటిలో ఆడటం చూస్తున్నట్లు యువీ తెలిపాడు. ఒక ఏడాది మొత్తంగా ఆడేకంటే రెండు-మూడు నెలలు క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నానని యువీ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top