విజయ్‌ శంకర్‌.. రాయుడు చూస్తున్నాడు!

Rayudu seeing Vijay Shankars 3 dimensional performance - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో విజయ్‌ శంకర్‌ను త్రీడైమన్షన్స్‌(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) ఆటగాడిగా పోల్చుతూ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అంబటి రాయుడికి అవకాశం ఇవ్వకుండా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడంపై ఇలా సరిపెట్టుకున్నాడు ఎంఎస్‌కే ప్రసాద్‌. దానికి అసహనం వ్యక్తం చేసిన రాయుడు.. వరల్డ్‌కప్‌ను చూడటానికి త్రీడి అద్దాలను ఆర్డర్‌ ఇచ్చా’ అంటూ సెటైర్‌ కూడా వేశాడు. అయితే మెగా టోర్నీలో అసలైన ఆటలోకి వచ్చేసరికి విజయ్‌ శంకర్‌ తేలిపోయాడనే చెప్పాలి. శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్‌ శంకర్‌.. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్‌మెంట్‌ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్‌ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్‌ శంకర్‌ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్‌ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్‌లో సర్ఫరాజ్‌ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.

దాంతో అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయ్‌ శంకర్‌ తుది జట్టులో ఎంపికకు మరో ఆలోచన లేకుండా పోయింది. కాగా, అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఔటైన విజయ్‌ శంకర్‌.. విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అది కూడా భారత్‌ జట్టుకు సవాల్‌గా మారిన నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ దిగి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో  విజయ్‌ శంకర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అసలు నాల్గో స్థానంలో విజయ్‌ శంకర్‌ను దింపడం ఏమిటని క్రికెట్‌ వ్యాఖ్యతలతో పాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘ విండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ బ్యాటింగ్‌లో ఇంకా లోపాలు కనబడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్‌ శంకర్‌ నిరాశపరుస్తున్నాడు. ఇలానే ఆడితే విజయ్‌ శంకర్‌కు అవకాశాలు రావడం కష్టం. నా వరకూ అయితే విజయ్‌ శంకర్‌కు మరో అవకాశం ఇచ్చి చూస్తారు’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

ఇక అభిమానులైతే విజయ్‌ శంకర్‌ను ఏకిపారేస్తున్నారు. ‘ విజయ్‌ శంకర్‌ను వెంటనే స్వదేశానికి పంపించండి. భారత ఎలెవన్‌లో  అతను అనవసరం’ అంటూ ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ అతని బ్యాటింగ్‌ బుమ్రాలాగా ఉండగా, బౌలింగ్‌లో కోహ్లిని గుర్తుకు తెస్తున్నాడు’ అంటూ మరొక అభిమాని ఎద్దేవా చేశాడు.  ‘ విజయ్‌ శంకర్‌ త్రీ డైమన్షనల్‌ ఆటను రాయుడు చూస్తున్నాడు’ అంటూ మరొకరు ట్వీట్‌లో సెటైర్‌ వేశారు. ‘ రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వకుండా విజయ్‌ను కొనసాగించడం ఏమిటి. ఇది స్థానిక మ్యాచ్‌ కాదు. ఐసీసీ 2019 వరల్డ్‌కప్‌’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇలా విజయ్‌ శంకర్‌ ఆట తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top