ఈసారి భారత-ఏ బౌలింగ్‌ కోచ్‌గా.. | Sakshi
Sakshi News home page

ఈసారి భారత-ఏ బౌలింగ్‌ కోచ్‌గా..

Published Tue, Aug 27 2019 5:01 PM

Ramesh Powar Appointed India A Bowling Coach - Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా పని చేసిన మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ రమేశ్‌ పొవార్‌ను తాజాగా భారత్‌-ఏ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా నియమించారు.  మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న పొవార్‌ భారత యువ జట్టు బౌలింగ్‌ కోచ్‌ నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  గతేడాది భారత మహిళా జట్టుకు నాలుగు నెలలు పాటు పొవార్‌ కోచ్‌గా పని చేశాడు. ఆ సమయంలో మిథాలీ రాజ్‌తో వివాదం చోటు చేసుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన సెమీ ఫైనల్‌కు మిథాలీని తప్పించడంతో వివాదం రాజుకుంది. ఇందుకు పొవారే కారణమనే వాదన వినిపించింది.

 అయితే ఆ తర్వాత భారత మహిళా జట్టు కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించగా, పొవార్‌ కూడా అందుకు అప్లై చేసుకున్నాడు. కాగా, డబ్యూ వీ రామన్‌ను బీసీసీఐ సలహా కమిటీ ఎంపిక చేయడంతో పొవార్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఇటీవల భారత అండర్‌-19 జట్లుకు సంబంధించి బీసీసీఐ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పవార్‌ హాజరవుతుండటంతో భారత-ఏ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో స్వదేశంలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో మాత్రమే పొవార్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత్‌ తరఫున 31 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు పొవార్‌ ఆడాడు.

Advertisement
Advertisement