విదర్భలో లోకసభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రముఖ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి.
సాక్షి, ముంబై : విదర్భలో లోకసభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రముఖ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఏప్రిల్ 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు ఇటు పోలీసులు, అటు అధికారులు కూడా అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో తొలి విడతన విదర్భలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. 70 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. మొత్తం 220 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు.
ముఖ్యంగా వార్ధా లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వెనక్కి తీసుకోకపోవడం విశేషం. ఇక అత్యధికంగా నాగపూర్ లోక్‌సభ నుంచి 54 మంది బరిలో ఉండగా అత్యల్పంగా అకోలా లోకసభ స్థానం నుంచి కేవలం అయిదుగురు పోటీ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలైన బుల్డానాలో 17, అమరావతి 19, యావత్మాల్-వాషీం 26, వార్ధా 21, చంద్రాపూర్ 18, గడ్‌చిరోలి-చిమూర్ 11, భండారా-గోండియా 26, రాంటెక్‌లో 23 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.అదే విధంగా అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు (చిహ్నాలు) కూడా కేటాయింపు పూర్తయ్యింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ కూటమి, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీల మధ్య బహుముఖ పోటీ జరగనుంది.
అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు వచ్చే ఓట్లపై ప్రధాన కూటమి అభ్యర్థుల విజయం ఆధారపడిఉంటుందని రాజకీయ పరిశీలకులు తెలుపుతున్నారు. మొదటి విడత ఎన్నికల బరిలో ప్రఫుల్ పటేల్, నితిన్ గడ్కరీ, విలాస్ ముత్తెంవార్, ముకుల్ వాస్నిక్, నవనీత్ రాణా తదితర ప్రముఖులున్నారు.