క్విటోవా హవా

Petra Kvitova beats home favourite Barty to enter Australian Open  - Sakshi

ఏడేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి

క్వార్టర్స్‌లో అలవోక విజయం

అన్‌సీడెడ్‌ కొలిన్స్‌ జోరు

ఎదురులేని నాదల్, సిట్సిపాస్‌  

అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ స్టార్‌ క్రీడాకారులు... ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుత ఆటతీరుతో దూసుకొస్తున్న అనామక క్రీడాకారులు... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తమ హవా చలాయిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా ఏడేళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్‌ చేరుకోగా... గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఏనాడూ తొలి రౌండ్‌ దాటని అన్‌సీడెడ్‌ డానియెలా కొలిన్స్‌ తన విజయపరంపర కొనసాగిస్తూ తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్‌ ఆరోసారి సెమీఫైనల్‌ చేరగా... గ్రీస్‌ యువతార సిట్సిపాస్‌ మరో అద్భుత విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరాడు.   

మెల్‌బోర్న్‌: రెండేళ్ల క్రితం ఆగంతకుడి కత్తి దాడిలో గాయపడి ఆరు నెలలపాటు ఆటకు దూరమైన పెట్రా క్విటోవాకు పునరాగమనంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆమె ఆడిన గత ఏడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో క్వార్టర్‌ ఫైనల్‌ దశనూ దాటలేదు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం క్విటోవా కదం తొక్కుతోంది. తన ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ టైటిల్‌ దిశగా సాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 6–4తో 15వ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై నెగ్గి 2012 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2014లో వింబుల్డన్‌ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్‌ చేరిన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ షరపోవాను బోల్తా కొట్టించిన యాష్లే బార్టీ ఈ మ్యాచ్‌లో మాత్రం క్విటోవా ముందు నిలువలేకపోయింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్విటోవా మూడు ఏస్‌లు సంధించి, మూడుసార్లు బార్టీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. సెమీఫైనల్‌ చేరే క్రమంలో క్విటోవా ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. గురువారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్‌ డానియెలా కొలిన్స్‌ (అమెరికా)తో క్విటోవా తలపడుతుంది. ‘కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా. కత్తి దాడిలో గాయపడ్డాక మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ దశకు రావడానికి నేను తీవ్రంగా శ్రమించాను. నాకైతే ఇది రెండో కెరీర్‌లాంటిదే.
పునరాగమనం చేశాక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అత్యుత్తమ  ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. ఈ క్షణాలను నేనెంతో ఆస్వాదిస్తున్నాను’ అని విజయానంతరం సెంటర్‌కోర్టులో క్విటోవా వ్యాఖ్యానించింది.  
మరో క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్‌ డానియెలా కొలిన్స్‌ 2–6, 7–5, 6–1తో మరో అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్స్‌ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది.  

అగుట్‌ పోరు ముగిసె... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ నాదల్, 14వ సీడ్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాదల్‌ 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై గెలుపొందగా... సిట్సిపాస్‌ 7–5, 4–6, 6–4, 7–6 (7/2)తో 22వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లో సెమీఫైనల్‌కు చేరాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతూ తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన అగుట్‌ కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. తొలి రౌండ్‌లో బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రేపై... మూడో రౌండ్‌లో పదో సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిరుటి రన్నరప్, ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచిన అగుట్‌ ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌పై సంచలన విజయం సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సిట్సిపాస్‌... ఈ ఏడాది తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నీ లక్ష్యమేంటి అని అడిగితే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరడం అని చెప్పాను. అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు’ అని 20 ఏళ్ల సిట్సిపాస్‌ అన్నాడు.  

పేస్‌ జంట పరాజయం
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సమంతా స్టోసుర్‌ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. పేస్‌–స్టోసుర్‌ ద్వయం 6–4, 4–6, 8–10తో ఐదో సీడ్‌ రాబర్ట్‌ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది.  పేస్‌ ఓటమితో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. 

నేటి క్వార్టర్‌ ఫైనల్స్‌ 
మహిళల సింగిల్స్‌ విభాగం 
నయోమి ఒసాకా (vs) ఎలీనా స్వితోలినా 
సెరెనా విలియమ్స్‌(vs) కరోలినా ప్లిస్కోవా 
పురుషుల సింగిల్స్‌ విభాగం 
మిలోస్‌ రావ్‌నిచ్‌(vs) లుకాస్‌ పుయి 
జొకోవిచ్‌(vs) నిషికోరి

ఉదయం గం. 5.30 నుంచి;  మధ్యాహ్నం గం. 1.30 నుంచి  సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top