
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అనుసరిస్తున్న విధానాన్ని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తప్పుపట్టారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లు ఏడాదంతా ఆడాల్సి వస్తోందని, అది వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఆయన అన్నారు. ‘ఎక్కువ సంఖ్యలో టోర్నీలు ఆడటం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుందనేది వాస్తవం.
అయితే సంవత్సరం పాటు ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీలు కొనసాగడం సరైంది కాదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్ లేదా ఆసియా, యూరోపియన్ చాంపియన్‌షిప్ లాంటివి గెలిచినప్పుడు కొందరికైనా నేరుగా అర్హత సాధించే సౌకర్యం ఉండాలి. ఇప్పుడేమో పిచ్చి పట్టినట్లుగా ఆటగాళ్లు ప్రపంచమంతా తిరగాల్సి వస్తోంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు.