బెంబేలెత్తించిన బౌల్ట్‌

New Zealand vs Sri Lanka 2nd Test at Christchurch - Sakshi

15 బంతుల్లో 6 వికెట్లు తీసిన కివీస్‌ పేసర్‌

క్రైస్ట్‌చర్చ్‌: మొదటి రోజు బౌలర్లను మురిపించిన రెండో టెస్టు మరుసటి రోజు ఆతిథ్య న్యూజిలాండ్‌ వైపు మళ్లింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (6/30) కెరీర్‌ బెస్ట్‌ స్పెల్‌ శ్రీలంకను కూల్చేసింది. బుధవారం ఒక్క వికెటైనా పడగొట్టలేకపోయిన బౌల్ట్‌ గురువారం కేవలం 15 బంతులే వేసి మిగిలిన 6 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 88/4తో ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కేవలం 16 పరుగులే చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ రోషన్‌ సిల్వా (21), డిక్‌వెలా (4) పరుగులైనా చేశారు కానీ... తర్వాత వచ్చిన పెరీరా (0), లక్మల్‌ (0), చమీర (0), లహిరు కుమార (0) ఖాతా  తెరవకుండానే బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా నిష్క్రమించారు.

చేతిలో ఆరు వికెట్లున్న లంక కనీసం గంటసేపయినా ఆడలేకపోవడం గమనార్హం. 40 నిమిషాల్లో లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. టెస్టుల్లో  బౌల్ట్‌ (6/30) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌పై ఇంతకుముందు 32 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన కెరీర్‌బెస్ట్‌ ప్రదర్శన ఇప్పుడు మెరుగైంది. 74 పరుగుల ఆధిక్యం పొందిన న్యూజిలాండ్‌ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 2 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు జీత్‌ రావల్‌ (74 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), టామ్‌ లాథమ్‌ (74; 8 ఫోర్లు) రాణించారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ 48 పరుగులు చేయగా... రావల్‌తో పాటు టేలర్‌ (25 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. మొత్తం 305 పరుగుల ఆధిక్యంతో కివీస్‌ పటిష్టస్థితిలో ఉంది. మ్యాచ్‌లో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top