ఇద్దరు కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌లు

Mehadi Hasan And Liton Das Concussion Substitutes - Sakshi

బంగ్లాదేశ్‌ వింత ఘనత

బంగ్లాదేశ్‌ జట్టు రెండో టెస్టుకు రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన మెహదీ హసన్, తైజుల్‌లను తుది జట్టు నుంచి తప్పించింది. అయితే అనూహ్యంగా వీరిద్దరు రెండో టెస్టులోనూ కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ ఇద్దరు కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌లుగా బరిలోకి దిగారు. ఒకే రోజు ఇలా ఇద్దరు కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌లు రావడం అనూహ్యం. మొహమ్మద్‌ షమీ విసిరిన బంతులకు లిటన్‌ దాస్, నయీమ్‌ హసన్‌ మైదానం వీడటమే అందుకు కారణం. షమీ వేసిన బౌన్సర్‌ను పుల్‌ చేయబోవడంతో లిటన్‌ దాస్‌ తలకు దెబ్బ తగిలింది. ఆ తర్వాత మరో ఆరు బంతులు ఆడినా... మగతగా ఉండటంతో దాస్‌ పెవిలియన్‌ వెళ్లిపోయాడు. రిఫరీతో మాట్లాడిన అనంతరం అతని స్థానంలో మెహదీ హసన్‌ (రెగ్యులర్‌ బౌలర్‌)ను ఎంపిక చేశారు.

అయితే దాస్‌ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌ కాబట్టి ఐసీసీ నిబంధన ప్రకారం హసన్‌ బ్యాటింగ్‌ మాత్రమే చేశాడు. అతను బౌలింగ్‌ చేయడానికి అవకాశం లేదు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లోనే నయీమ్‌ హసన్‌కు కూడా ఇలాగే జరిగింది. స్వల్ప చికిత్స తర్వాత నయీమ్‌ బ్యాటింగ్‌ కొనసాగించి కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచాడు. అవుటైన అనంతరం అతనూ ఆస్పత్రికి పరుగు తీశాడు. దాంతో ఆఫ్‌ స్పిన్నరైన నయీమ్‌ స్థానంలో మరో ఆఫ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ బౌలింగ్‌కు దిగి తొలి రోజు ఎనిమిది ఓవర్లు వేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లలో ఒక్క రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ కూడా లే డు. తొలి టెస్టుకు ముందే మొసద్దిక్‌ హుస్సేన్‌ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడినా ఇన్ని రోజుల్లో మరో బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయలేదు. కోల్‌కతా టెస్టుకు రెండు రోజుల ముందు సైఫ్‌ హసన్‌ గాయపడ్డాడు. ఢాకా నుంచి కోల్‌కతా ఫ్లయిట్‌లో 30 నిమిషాల ప్రయాణమైనా సరే మరో బ్యాట్స్‌మన్‌ పంపే ప్రయత్నం కూడా బోర్డు చేయలేదు!  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top