ముగిసిన మేరీకోమ్‌ పోరాటం

Mary Kom Settles for Bronze After Loses Semi-final At Womens WBC - Sakshi

ఉలన్‌ ఉడే(రష్యా): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ పోరాటం ముగిసింది. జడ్జిల వివాదాస్పద నిర్ణయంతో సెమీ ఫైనల్‌లో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మహిళల 51 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరిన మేరీ శనివారం టర్కీకి చెందిన రెండో సీడ్‌ బుసెనాజ్ కాకిరోగ్లుతో తలపడింది. 1-4 తేడాతో ఓడిపోయి కాంస్యంతో వెనుదిరిగింది. ఆదివారం  జరిగే ఫైనల్లో రష్యా బాక్సర్‌ లిలియాతో బుసెనాజ్ తలపడనుంది. అయితే కాంస్యం గెలిచిన మేరీకోమ్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చరిత్రలోనే అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది.

వివాదాస్పద నిర్ణయం
ఇద్దరు బాక్సర్లు ఆత్మవిశ్వాసంతో సెమీస్‌ బరిలోకి దిగారు. రెండో రౌండ్‌లో బుసెనాజ్‌ దూకుడు పెంచి మేరీకోమ్‌ను ఆత్మరక్షణలో పడేసింది. మేరీకోమ్‌ కంటే హైట్‌ ఎక్కువగా ఉండడం కూడా బుసెనాజ్‌ కలిసొచ్చింది. రెండు రౌండ్ల పాటు నువ్వా, నేనా అన్నట్టు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. బౌట్‌ ముగిసిన తర్వాత జడ్జిల నిర్ణయంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని, మరో బౌట్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. భారత్‌ అప్పీలును  టెక్నికల్‌ కమిటీ తోసిపుచ్చింది. స్కోరు 3:2/3:1 ఉన్నప్పుడు మాత్రమే అభ్యంతరాలు పరిశీలించడానికి వీలవుతుందని తెలపడంతో మేరీకోమ్‌ కాంస్యంతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, బుసెనాజ్‌ను విజేతగా ప్రకటించడంపై మేరీకోమ్‌ మండిపడింది. తాను ఓడిపోయినట్టు ప్రకటించిన న్యాయ నిర్ణేతల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జిల నిర్ణయం సరైందో, కాదో ప్రపం‍చం మొత్తానికి తెలుసని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

కాగా ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరీకి  ఇది ఎనిమిదవ పతకం. దీంతో సుదీర్ఘ కాలంపాటు విజయవంతమైన బాక్సర్‌గా మేరీ నిలిచారు. ఇప్పటి వరకు మేరి తన కెరీర్‌లో ఆరు బంగారు, ఒక సిల్వర్‌, ఒక కాంస్య పతకాలను సాధించారు. ఇటీవల 48 కేజీల విభాగం నుంచి 51 కేజీల కేటగిరీకి మారిన మేరీకోమ్‌ పేరును భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ అవార్డుకు సిఫార్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అవార్డుకు నామినేట్‌ అయిన మొదటి మహిళ అథ్లెట్‌గా ఆమె ఘనత సాధించారు. (చదవండి: చరిత్ర సృష్టించిన మేరీకోమ్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top