నేను ఎందుకిలా?: లసిత్‌ మలింగా

Malinga Blames Himself For T20 Drubbing In India - Sakshi

పుణె: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కనీసం పోరాడకుండానే కోల్పోవడంపై శ్రీలంక కెప్టెన్‌ లసిత్‌ మలింగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాకపోవడం కారణంగానే భారత్‌ ముందు ఘోరంగా చతికిలబడ్డామన్నాడు.   ఇక్కడ ప్రధానంగా తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగా విమర్శించుకున్నాడు. ‘ నేను చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌ను. నాకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉంది. వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌నే కానీ భారత్‌తో కనీసం వికెట్‌ తీయలేకపోయా. వికెట్లు సాధించలేక ఒత్తిడిలో పడ్డా. ఫ్రాంచైజీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లో ఆడినా భారత్‌తో సిరీస్‌ ఆఖరి రోజు ముగిసే సరికి నేను ఉపయోగపడలేదు’ అని మలింగా ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి వరల్డ్‌ రికార్డు.. సిరీస్‌ భారత్‌ కైవసం)

ప్రధానంగా కెప్టెన్సీ కూడా తనపై భారం చూపిందన్నాడు. ఇక్కడ జట్టు పరంగా శ్రీలంక ఆశించిన స్థాయిలో లేకపోవడమే కెప్టెన్‌గా తనపై ఒత్తిడి పడిందన్నాడు. 2014లో తాను కెప్టెన్‌గా చేసిన సమయంలో తనకు పెద్దగా భారం అనిపించకపోవడానికి కారణం జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటమేనన్నాడు. కుమార సంగక్కరా, జయవర్ధనే, దిల్షాన్‌ వంటి క్రికెటర్లు తమ జట్టులో ఉండటం వల్ల కెప్టెన్సీ భారం అనిపించేది కాదన్నాడు.ఇక టీ20ల్లో భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనది మలింగా స్పష్టం చేశాడు. ఒకవైపు భారత ఆటగాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు సాధిస్తే, తమ జట్టు మాత్రం విఫలమైందన్నాడు. టీ20ల్లో ప‍్రతీ బంతి విలువైనదేనని, కనీసం ప్రతీ బంతికి సింగిల్‌ అయినా తీయాలన్నాడు.

మరొకవైపు టీమిండియా బ్యాటింగ్‌ అమోఘం అంటూ కొనియాడాడు. వారు షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి తమ ప్రదర్శన మెరుగపడిన దాఖలాలు లేవని మలింగా అంగీకరించాడు. గతంలో శ్రీలంక అంటే పటిష్టంగా ఉండేదని సంగతిని గుర్తు చేసుకున్నాడు. కుమార​ సంగక్కరా-మహేలా జయవర్ధననే, దిల్షాన్‌లు ఇన్నింగ్స్‌లు నిర్మించి లంక విజయాల్లో కీలక పాత్ర పోషించే వారన్నాడు. ప్రస్తుతం తమ జట్టులో అది కొరవడిందనే విషయం ఒప్పుకోవాల్సిందేనన్నాడు. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లు యువ క్రికెటర్లే కాకుండా టాలెంట్‌ కూడా ఉందన్నాడు. కాకపోతే పరిస్థితులన్ని బట్టి ఆడటంలో వారు విఫలమవుతున్నారన్నాడు. భవిష్యత్తులోనైనా పరిస్థితిని అర్థం చేసుకుని క్రికెట్‌ ఆడతారని ఆశిస్తున్నట్లు మలింగా తెలిపాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్‌ చాలా మిస్సయ్యాడు..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top