గృహహింస కేసు.. షమీకి సమన్లు

Kolkata Police Issued Summons to Shami - Sakshi

కోల్‌కతా : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. తాజాగా షమీకి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీచేశారు. గృహహింస చట్టం 2005 కింద షమీ భార్య హసీన్‌ జహాన్‌ అలీపూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ షమీకి పోలీసులు సమన్లు పంపారు. షమీతోపాటు అతని సోదరుడు హసీబ్‌ అహ్మద్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. 

హసీన్‌ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష ఓ చెక్‌ ఇస్తే.. అది కూడా బౌన్స్‌ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. హసీన్‌ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు షమీ నుంచి భరణంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని కోల్‌కతా పోలీసులను అలీపూర్‌ కోర్టు ఆదేశించింది.

షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్‌ ఆరోపణలు చేసింది విదితమే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top