అందుకే కోహ్లి బ్యాటింగ్‌ కళ తప్పింది: గంభీర్‌

Kohli Needs To Be Emotionally Charged, Gambhir - Sakshi

రెచ్చగొట్టే వాళ్లే లేరా?

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దారుణ వైఫల్యం చూసి ఫ్యాన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు. నాలుగు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌, రెండో టెస్టులో ఒక ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లి.. కేవలం హాఫ్‌ సెంచరీ మాత్రమే చేశాడు.  తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో కోహ్లి ఇంత దారుణంగా విఫలం కావడం ఇదే తొలిసారి. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్ల కవ్వింపులు లేకపోవడం వల్లనే కోహ్లి విఫలమై ఉంటాడని మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడుతున్నాడు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు కోహ్లి అత్యుత్తమంగా ఆడతాడని, ఇప్పుడు న్యూజిలాండ్‌ పర్యటనలో అతన్ని ఎవరూ రెచ్చగొట్టకపోవడంతోనే ఇలా నిరాశపరుస్తున్నాడా అనే అనుమానాన్ని గంభీర్‌ వ్యక్తం చేశాడు. కోహ్లిని కవ్వింపు చేయకపోవడం వల్లే అతను విఫలం అవుతున్నాడు అనేది కచ్చితంగా చెప్పలేము కానీ, రెచ్చగొట్టినప్పుడు మాత్రం కోహ్లి మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయన్నాడు. (కెప్టెన్‌ అయినంత మాత్రాన అలా చేస్తావా?)

న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా సౌమ్యులని, ఈ పర్యటనకు ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లి వెల్లడించిన విషయం తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ని ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా..? అని మీడియా ప్రశ్నకు కోహ్లి బదులిస్తూ.. అలాంటి భావనే తమకు లేదన్నాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు చాలా సౌమ్యులని, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో అక్కడికి వెళ్లడం లేదన్నాడు. అదే సమయంలో కివీస్‌ ఆటగాళ్లని చూస్తే కవ్వింపులు, ప్రతీకార ఆలోచనలే రావన్నాడు. కివీస్ ఆటగాళ్లు కూడా కోహ్లీని రెచ్చగొట్టే పనులు ఒక్కటీ చేయలేదు. ఇదే అతని వైఫల్యానికి కారణం​ కావొచ్చని గంభీర్‌ కాస్త అనుమానం వ్యక్తం చేశాడు.(19 ఇన్నింగ్స్‌ల్లో ‘జీరో’..!)

‘ఇది అతని విషయంలో పనిచేస్తుందా? అనేది కచ్చితంగా చెప్పలేను.  కానీ ప్రత్యర్థి నుంచి కవ్వింపులు ఎదురైనప్పుడు కోహ్లి అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని గంభీర్‌ తెలిపాడు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తనని పదే పదే కవ్వించడంతో ఆ సిరీస్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలతో చెలరేగిపోయాడు. గత ఏడాది వెస్టిండీస్ బౌలర్ విలియమ్స్‌‌‌ చేసిన నోట్‌బుక్, సైలెంట్, సర్‌ప్రైజ్ సెలబ్రేషన్స్‌ కవ్వింపులకి కోహ్లి రెచ్చిపోయాడు. అంటే కోహ్లిని రెచ్చగొడితే బ్యాట్‌తో అంతకుమించి రెచ్చిపోతాడనేది ఇక్కడ కనబడుతోంది. దాంతో కివీస్‌తో సిరీస్‌లో కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలనుకునే అభిమానులు మాత్రం అతన్ని రెచ్చగొట్టే వారే లేరా అని తమకు తాము ప్రశ్నించుకుంటున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top