19 ఇన్నింగ్స్‌ల్లో ‘జీరో’..!

Virat Kohli Enduring Worst Batting Run After 2014 - Sakshi

వెల్లింగ్టన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంటేనే పరుగుల మెషీన్‌. మరి ఇప్పుడు కోహ్లిలో పస తగ్గిందా అంటే అవుననక తప్పదేమో. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి. బ్యాట్‌  పడితే పరుగుల మోత మోగించే కోహ్లి ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి చివరిసారి సెంచరీ సాధించగా, ఆపై ఇప్పటివరకూ శతకాన్ని ఖాతాలో వేసుకోలేదు. న్యూజిలాండ్‌తో ఈరోజు ఆరంభమైన తొలి టెస్టులో కోహ్లి మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.

ఓవరాల్‌గా న్యూజిలాండ్‌ పర్యటలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.  కివీస్‌ పర్యటనలో కేవలం ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే సాధించిన కోహ్లి.. పరుగులు చేయడానికి అపసోపాలు పడుతున్నాడు.  ఇక కోహ్లి వరుస 19 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ 19 ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించినా దాన్ని సెంచరీగా మలచుకోవడంలో కోహ్లి విఫలమయ్యాడు. (ఇక‍్కడ చదవండి: 30 ఏళ్లలో మయాంక్‌ ఒక్కడే..)

ఇలా 19 అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే కోహ్లి ఖాతాలో అంతర్జాతీయ సెంచరీ లేకపోవడం ఇది మూడోసారి. గతంలో 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకూ 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి సెంచరీ సాధించకపోగా, 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకూ 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో శతకం నమోదు చేయలేకపోయాడు.  2011లో వరుస 24 ఇన్నింగ్స్‌ల్లో 4 అర్థ శతకాలకే పరిమితమైన కోహ్లి.. 2014లో 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. 2019లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసే సమయానికి చూస్తే ప్రతీ ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి  శతకం సాధించిన ఘనత ఉండగా, వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో శతకం లేకపోవడం గమనార్హం. దాంతో తన 11 ఏళ్లకు పైగా ఉన్న అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లి ‘మూడో’ చెత్త ప్రదర్శన చేసినట్లయ్యింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top