ఈసారి పంజా(బ్‌) కోల్‌కతాపై...

Kings XI Punjab won by 9 wickets  - Sakshi

గేల్, రాహుల్‌ మెరుపులు

నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవెన్‌ విజయం

కరీబియన్‌ గేల్‌ భీకర ఫామ్‌లో ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నబోతుంది. అతడి హిట్టింగ్‌కు కేఎల్‌ రాహుల్‌ కళాత్మక షాట్లు తోడైతే ఇక అడ్డేముంది. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఛేదన ఇంత సులువా అన్నట్లు సాగిన వీరిద్దరి భాగస్వామ్యం ముంగిట పైచేయి సాధించడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకపోయింది.   

కోల్‌కతా: క్రిస్‌ గేల్‌ పంజాబ్‌కు జాంపండులా దొరికినట్లున్నాడు. పెద్దగా ఆశల్లేకుండానే ఈ సీజన్‌ బరిలోకి దిగిన జట్టును తన ఆటతో ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాడు. అతడికి ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ కూడా తోడవడంతో శనివారం కోల్‌కతాను దాని సొంతగడ్డపైనే పంజాబ్‌ 9 వికెట్లతో అలవోకగా ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌... ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (41 బంతుల్లో 74; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు), రాబిన్‌ ఉతప్ప (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌ ఓపెనర్లు గేల్‌ (38 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లోకేశ్‌ రాహుల్‌ (27 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 8.2 ఓవర్లలో కింగ్స్‌ ఎలెవెన్‌ స్కోరు 96/0 వద్ద వర్షం అంతరాయం కలిగించింది. గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని సవరించి 13 ఓవర్లలో 125గా నిర్ణయించారు. దాంతో పంజాబ్‌ విజయానికి 28 బంతుల్లో 29 పరుగులు అవసరమయ్యాయి. దీనిని ఆ జట్టు రాహుల్‌ వికెట్‌ కోల్పోయి 11.1వ ఓవర్‌లోనే అందుకుంది. పంజాబ్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం.  

ఆ ముగ్గురి మెరుపులతో... 
మెరుపు షాట్లు కొట్టే నరైన్‌ (1) తొందరగానే నిష్క్రమించడంతో కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. అయితే, లిన్, ఉతప్ప దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 72 పరుగులు జోడించారు. శరణ్‌ వేసిన 8వ ఓవర్లో విరుచుకుపడి 23 పరుగులు సాధించారు. అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉతప్ప, మరుసటి ఓవర్లోనే సమ్వనయ లోపంతో నితీశ్‌ రాణా (3) రనౌట్‌ కావడంతో రెండు ఓవర్ల పాటు స్కోరు మందగించింది. ఈ దశలో దినేశ్‌ కార్తీక్‌ వస్తూనే బ్యాట్‌ ఝళిపించాడు. లిన్‌ కూడా తగ్గక పోవడంతో 34 బంతుల్లోనే 62 పరుగులు వచ్చాయి. వీరి జోరు చూస్తే స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ, లిన్, రస్సెల్‌ (10) వెంటవెంటనే అవుట్‌ కావడం, కార్తీక్‌ కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది. పంజాబ్‌ బౌలర్లు చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చారు. శుభ్‌మన్‌ గిల్‌ (8 బంతుల్లో 14 నాటౌట్‌) దూకుడు చూపలేకపోవడంతో స్కోరు 191కే పరిమితమైంది. 

ఈ ఇద్దరి జోరుతో... 
లక్ష్యం భారీగా ఉన్నా పంజాబ్‌ ఓపెనర్లు గేల్, రాహుల్‌ బెదరకుండా ఆడారు. కోల్‌కతా తమ తురుపుముక్క నరైన్‌ను కాకుండా శివమ్‌ మావి, రస్సెల్‌తో ప్రారంభ ఓవర్లు వేయించడంతో వీరికి ఇబ్బంది ఎదురవలేదు. ఇద్దరిలో రాహులే స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. మావి వేసిన కొన్ని బంతులను ఆడలేకున్నా, రాణా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో గేల్‌ ప్రతాపం చూపాడు. నాలుగో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక సవరించిన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో గేల్‌ తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపి అర్ధ శతకం (28 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. నరైన్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫిఫ్టీ (24 బంతుల్లో) అందుకున్న రాహుల్‌ మరో రెండు ఫోర్లు కొట్టి అవుటయ్యాడు. కరన్‌ బంతిని సిక్స్‌ కొట్టిన గేల్‌ మరో 11 బంతులు ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top