
కోహ్లి సరసన చేరాడు!
ఆ ఇద్దరూ స్టార్ క్రికెటర్లే కాదు.. జట్టు కీలక విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న కెప్టెన్లు కూడా.
దుబాయ్:ఆ ఇద్దరూ స్టార్ క్రికెటర్లే కాదు.. జట్టు కీలక విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న కెప్టెన్లు కూడా. ఒకరు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి అయితే.. మరొకరు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ప్రస్తుతం విరాట్ కోహ్లి సరసన విలియమ్సన్ చేరిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్ ప్రకారం అన్ని ఫార్మాట్లలో టాప్-5 లో స్థానం సంపాదించిన ఆటగాడిగా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు ట్వంటీ 20ల సిరీస్ తరువాత రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న విలియమ్సన్ నాల్గో స్థానానికి చేరాడు. దాంతో అన్ని ఫార్మాట్లలో టాప్-5లో స్థానం సంపాదించిన ఆటగాడిగా నిలిచాడు.
అంతకుముందు కోహ్లి ఒక్కడే అన్ని ఫార్మాట్ల టాప్-5 ర్యాంకింగ్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి.. టెస్టు, వన్డే ఫార్మాట్ల ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు. మరొకవైపు విలియమ్సన్ టెస్టు, ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానంలో ఉండగా, వన్డే ఫార్మాట్లో ఐదో స్థానంలో ఉన్నాడు.