ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ

Kagiso Rabada Ruled Out For Rest Of IPL 2019 - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీసీ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్‌ కాగిసో రబడ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని డీసీ తెలిపింది. స్వల్ప గాయం కారణంగా బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు. అయితే త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్‌ నుంచి వెంటనే వచ్చేయాలని అతడికి దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కబురు పెట్టింది. ఫలితంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

రబడ లేకపోవడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో డీసీ 80 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదని రబడ వ్యాఖ్యానించాడు. వన్డే ప్రపంచకప్‌ ఎంతో దూరంలో లేనందున స్వదేశానికి వెళ్లాల్సివస్తోందన్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడటం​ మర్చిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు. తమ టీమ్‌ ఐపీఎల్‌ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు. రబడ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడాన్ని డీసీ హెచ్‌ కోచ్ రికీ పాంటింగ్‌ దురదృష్టకర పరిణామంగా వర్ణించాడు. వరల్డ్‌కప్‌లో రబడ రాణించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ శుభాకాంక్షలు తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top