స్వర్ణ సురేఖ

Jyothi Surekha Vennam, Abhishek Varma claim gold at Asian archery - Sakshi

మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో బంగారు పతకం

మహిళల టీమ్‌ విభాగంలో రజతం

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్‌ విభాగం మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్‌ వర్మ (భారత్‌) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్‌ చెన్‌చియె లున్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.

ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్‌ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది.  

అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్‌ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్‌ సో, యున్‌ సూ సాంగ్, డేయోంగ్‌ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, మోహన్‌ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్‌ తేడాతో జేవన్‌ యాంగ్, యోంగ్‌హి చోయ్, యున్‌ క్యు చోయ్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్‌ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.  

2: కాంపౌండ్‌ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్‌ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది.

3: ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 

30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top