కరోనాపై పోరు: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

Jos Butler Auctions His World Cup Shirt To Raise Funds For Hospitals - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి.. ఆ మొత్తాన్నికరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న లండన్‌లోని రెండు ఆస్పత్రులకు అందిస్తానని చెప్పారు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌, హారెఫైడ్‌ ఆస్పత్రులకు అందిస్తాను. కోవిడ్‌-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయండి.’అని బట్లర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
(చదవండి: కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం)

ఇక మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కూడా ఆస్పత్రుల వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. లార్డ్స్‌ మైదానంలో వారి వాహనాలు పార్కింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కాగా, యూకేలో ఇప్పటివరకు 25వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1500 మంది మృతి చెందారు. ఇదిలాఉండగా.. 2019 జులై 14న లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇంగ్లండ్‌కు ఇదే తొలి వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీ కావడం విశేషం.
(చదవండి: పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top