ఓ మిలిటెంట్‌ను వెతికి పట్టుకునే క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ఆటగాళ్లను పోలీసులు భయాందోళనలకు గురిచేశారు.
జమ్మూ: ఓ మిలిటెంట్‌ను వెతికి పట్టుకునే క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ఆటగాళ్లను పోలీసులు భయాందోళనలకు గురిచేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వారి హోటల్ గదులకు వచ్చి తనిఖీలు చేసి విచారించారు. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రంజీ మ్యాచ్ గ్రూప్ సిలో భాగంగా హైదరాబాద్‌తో తమ చివరి రోజు (బుధవారం) ఆటకు ముందు రాత్రి ఈ ఘటన జరిగింది.
ఈ ఉదంతాన్ని ఆల్‌రౌండర్ షమీయుల్లా బేగ్ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించాడు. ‘ఆ రాత్రి మేమంతా నిద్రపోలేదు. అర్ధరాత్రి సాయుధ పోలీసులు వచ్చి తెల్లవారుజాము వరకు మమ్మల్ని ప్రశ్నించారు. రొటీన్ చెకప్ అని చెబుతున్నా వారి ప్రవర్తన దారుణంగా ఉంది. రాష్ర్టం తరఫున ఆడుతున్న ఆటగాళ్లపై ఇలాంటి వైఖరి సరికాదు’ అని బేగ్ అన్నాడు. మరోవైపు పోలీసులు తమ వైఖరిని సమర్థించుకున్నారు. ఇది చాలా రొటీన్‌గా జరిగే వ్యవహారమేనని, ఆ హోటళ్లో రంజీ ఆటగాళ్లు ఉన్న విషయం తమకు తెలీదని, వారిని టార్గెట్ చేసుకుని సోదాలు చేయలేదని జమ్మూ పోలీస్ ఐజీ రాజేష్ కుమార్ అన్నారు.