భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ రద్దు!

India's ODI Series Against South Africa Called Off - Sakshi

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మిగతా రెండు వన్డేలను రద్దు చేశారు. తొలి వన్డే వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దు కాగా, మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కరోనాను మహమ్మారిగా డబ్యూహెచ్‌వో ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ క‍్రమంలోనే ఇప్పటికే పలు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు రద్దు కాగా, ఇప్పుడు భారత్‌-దక్షిణాఫ్రికాల వన్డే సిరీస్‌పై కూడా దాని ప్రభావం పడింది. ఆ క్రమంలోనే లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సిన రెండు వన్డేలను రద్దు చేయడానికి బీసీసీఐ మొగ్గుచూపింది.

తొలుత అభిమానులకు ఎంట్రీ లేకుండా ఆ మ్యాచ్‌లు నిర్వహించాలని చూసినా, చివరకు రద్దు చేయక తప్పలేదు. దాంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమ స్వదేశాలకు తిరిగి పయనం కానున్నారు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ను వాయిదా వేయగా, ఇప్పుడు వన్డే సిరీస్‌కు ఆ సెగ తగలింది. ఈ సిరీస్‌ను రద్దు చేయడమే ఉత్తమమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. (ఐపీఎల్‌ 2020 వాయిదా)

అంతకుముందు ఐపీఎల్‌ను వాయిదా వేయడానికి బీసీసీఐ మొగ్గుచూపింది.  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర  ప్రభుత్వం పలు ఆంక్షల్ని విధించడంతో ఐపీఎల్‌ను వాయిదా వేయక తప్పలేదు. కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. దాంతో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ ఐపీఎల్‌ వాయిదా పడింది. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, విదేశీ ఆటగాళ్ల వీసాల విషయంలో సమస్యలు తలెత్తడంతో దాన్ని వాయిదా వేయడం తప్ప మరొక మార్గం కనబడులేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top