ఒలింపిక్స్‌ వరకు కోచ్‌ల కొనసాగింపు!

Indias foreign coaches set for extended contracts - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేకించి ఒలింపిక్స్‌ కోసమే విదేశీ కోచ్‌లను నియమించుకున్న భారత క్రీడా సమాఖ్యలు ఇప్పుడు ఆ కోచ్‌ల కాంట్రాక్టు గడువు పొడిగించాలని భావిస్తున్నాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ వల్ల టోక్యో మెగా ఈవెంట్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆ పోటీలు ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాలని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌)కి పలు క్రీడా సమాఖ్యల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. 

మహిళా రెజ్లింగ్‌ కోచ్‌ ఆండ్రూ కుక్, షూటింగ్‌ (పిస్టల్‌) కోచ్‌ పావెల్‌ స్మిర్నోవ్, బాక్సింగ్‌ కోచ్‌లు శాంటియాగో నియెవా, రాఫెల్లె బెర్గమస్కొ, అథ్లెటిక్స్‌ హైపెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ హెర్మన్‌ తదితర విదేశీ కోచ్‌లకు ‘సాయ్‌’ పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కొనసాగుతున్న దృష్ట్యా క్రీడా శిబిరాలేవీ కొనసాగడం లేదు. ఈ లాక్‌డౌన్‌ ముగిశాక కోచ్‌ల సేవలు, శిబిరాలు మొదలవుతాయి. ‘విదేశీ కోచ్‌ల జీతాలను ‘సాయ్‌’ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులు  వారికి తెలుసు. కాబట్టి సహకరించేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’ అని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కార్యదర్శి వీఎన్‌ ప్రసూద్‌ తెలిపారు. కుక్‌ (అమెరికా), టెమొ          గెబిష్విలి (జార్జియా), బజ్‌రంగ్‌ పూనియా కోచ్‌ షాకో బెంటినిడిస్‌ (జార్జియా)లతో డబ్ల్యూఎఫ్‌ఐ కాంట్రాక్టు పొడిగించుకుంటుంది. 21 రోజుల లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఆటగాళ్ల సన్నాహకాలు మొదలవుతాయని ప్రసూద్‌ ఆశిస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top