ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. తమకన్నా ఎంతో మెరుగైన ఒమన్...
ఫిఫా క్వాలిఫయర్స్ రెండో రౌండ్
బెంగళూరు : ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. తమకన్నా ఎంతో మెరుగైన ఒమన్ జట్టుపై సంచలన ఆటతీరును చూపకపోయినా చివరి వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శనే కనబరిచింది. గురువారం కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో ఓడింది. భారత్ తరఫున ఏకైక గోల్ సునీల్ చెత్రి (26వ ని.) చేయగా... ఒమన్ నుంచి ఖాసిం సేద్ (1వ ని.) అల్ హోస్నీ (40వ ని.) గోల్స్ చేశారు.
అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఒమన్ మ్యాచ్ ప్రారంభమైన తొలి 30 సెకన్లలోనే గోల్ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచింది. ఆతిథ్య డిఫెండర్లను ఏమార్చుతూ ఖాసిం వేగంగా స్పందించి కీపర్ సుబ్రతాను బోల్తా కొట్టించాడు. అయితే ఆ తర్వాత సుబ్రతా మెరుపు కదలికలతో ఒమన్ అవకాశాలను వమ్ము చేశాడు. 26వ నిమిషంలో సీనియర్ స్ట్రయికర్ చెత్రి ఎడమ కాలితో చేసిన అద్భుత గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. 40వ నిమిషంలో ఒమన్‌కు లభించిన పెనాల్టీ అవకాశాన్ని అల్ హోస్నీ గోల్ చేయడం ద్వారా తన జట్టు ఆధిక్యం 2-1కి పెంచాడు. ఆ తర్వాత భారత్ కోలుకోలేకపోయింది. అటు ఒమన్ అటాకింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్ బ్యాక్‌లైన్ ఇబ్బంది పడింది. అయితే ఓటమిలో భారీ తేడా లేకుండా చూసుకోగలిగింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 16న గ్వామ్‌తో ఆడుతుంది.


